శనివారం 30 మే 2020
Business - Apr 30, 2020 , 00:17:57

మేము మాఫీ చేసిన అప్పులన్నీ మీరిచ్చినవే

మేము మాఫీ చేసిన అప్పులన్నీ మీరిచ్చినవే

  • ఫోన్లతోనే రాయబారం
  • ఎగవేతదారులంతా వాళ్లే
  • కాంగ్రెస్‌పై నిర్మల ధ్వజం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29: బాకీలు ఎగ్గొట్టినవారంతా గత యూపీఏ ప్రభుత్వ హయాంలో రుణాలు తీసుకున్నవారేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇప్పటి రుణ ఎగవేతదారులకు ఒకప్పుడు కాంగ్రెస్‌ పాలకులు ఫోన్లలో మాట్లాడి అప్పులిప్పించారని ధ్వజమెత్తారు. టాప్‌-50 ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులకు చెందిన రూ.68,607 కోట్ల బాకీలు రద్దయ్యాయని సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో మంగళవారం రాత్రి పొద్దుపోయాక వరుస ట్వీట్లలో మంత్రి స్పందించారు. 

ప్రజలను తప్పుదోవ పట్టించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో ఎందుకు విఫలమయ్యాం? అన్నదానిపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. 2009-10 ఆర్థిక సంవత్సరం నుంచి 2013-14 వరకు రూ.1.45 లక్షల కోట్లకుపైగా బాకీలను బ్యాంకులు రద్దు చేశాయని, అప్పుడు యూపీఏ-2 సర్కారు పాలనేనని గుర్తుచేశారు.


logo