ఆదివారం 17 జనవరి 2021
Business - Jan 14, 2021 , 20:26:58

కేంద్ర బ‌డ్జెట్ ముహూర్తం ఖ‌రారు

కేంద్ర బ‌డ్జెట్ ముహూర్తం ఖ‌రారు

న్యూఢిల్లీ: వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం (2021-22) వార్షిక బ‌డ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టేందుకు ముహూర్తం ఖ‌రారైంది. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన 11 గంట‌ల‌కు ఆమె పార్ల‌మెంట్‌కు బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను స‌మ‌ర్పిస్తారు. ఈ నెల 29వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు పార్ల‌మెంట్ ఉభ‌యస‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌సంగిస్తారు. 

సాధార‌ణంగా బ‌డ్జెట్ ప్ర‌సంగం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మవుతుంది. కొన్నేళ్ల క్రితం వ‌ర‌కు రైల్వేశాఖ‌కు ప్ర‌త్యేక బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టేవారు. 2017 నుంచి ఆ సంప్ర‌దాయానికి కేంద్రం తెర దించింది. సాధార‌ణ బ‌డ్జెట్‌లో భాగంగా రైల్వే బ‌డ్జెట్‌ను మార్చేసింది.

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌నే చిన్నాభిన్నం చేసిన క‌రోనా మ‌హ‌మ్మారి విసురుతున్న స‌వాల్‌ను అధిగ‌మించి దేశ ఆర్థిక రంగానికి పున‌రుత్తేజాన్నిచ్చేందుకు ఆధునిక భార‌తంలోనే ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సార‌థ్యంలోని టీం అత్యంత స‌వాళ్ల‌తో కూడిన బ‌డ్జెట్‌ను స‌మ‌ర్పించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా సంప్ర‌దాయాలు, ప‌ద్ద‌తుల‌తో నిమిత్తం లేకుండా పేప‌ర్ లెస్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. 

1947 న‌వంబ‌ర్ 26 త‌ర్వాత బ‌డ్జెట్ ప్ర‌తులు ముద్రించ‌కుండానే విత్త‌మంత్రి తొలిసారి బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించ‌నున్నారు. బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను ముద్రించ‌డానికి నార్త్‌బ్లాక్‌లో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది బ‌డ్జెట్ అధికారులు ఈ భ‌వ‌నంలోనే బ‌స చేసేందుకు ఏర్పాట్లు ఉంటాయి. బ‌డ్జెట్‌ను పార్ల‌మెంట్‌లో స‌మ‌ర్పించే వ‌ర‌కు ఆర్థిక‌శాఖ అధికారులు నార్త్‌బ్లాక్‌ను వీడి వెళ్ల‌రు.

బ‌డ్జెట్ విధి విధానాలు ఖ‌రారైన త‌ర్వాత హల్వా త‌యారు చేశాక ప్ర‌తుల ముద్ర‌ణ ప్రారంభం అవుతుంది. కానీ ఈ ద‌ఫా హాల్వా త‌యారీ ముచ్చ‌ట ఉండ‌క‌పోవ‌చ్చున‌న్న అభిప్రాయం వినిపిస్తున్న‌ది. అయితే, సంప్ర‌దాయంగా కొన‌సాగుతున్న హాల్వా త‌యారీ వేడుక బ‌డ్జెట్ స‌మ‌ర్పించ‌డానికి 10 రోజులు ముందుగా నిర్వ‌హిస్తార‌ని ఆర్థిక శాఖ వ‌ర్గాలు తెలిపాయి. డిజిట‌ల్ వేదిక‌గానే బ‌డ్జెట్ ప్ర‌తులు 750 మంది ఎంపీల‌కు అందుతాయి. ఒక ట్ర‌క్‌లో బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను త‌ర‌లించే ప్ర‌క్రియ కూడా ఈ ద‌ఫా ఉండ‌దు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.