ఆదివారం 31 మే 2020
Business - May 09, 2020 , 01:20:20

యూబీఐ, పీఎన్‌బీ రుణరేట్ల తగ్గుదల

యూబీఐ, పీఎన్‌బీ రుణరేట్ల తగ్గుదల

ముంబై, మే 8: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) తమ రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. అన్ని కాలపరిమితులతో కూడిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌)ను 15 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గించామని, ఈ నెల 11 నుంచి ఇది అమల్లోకి వస్తుందని యూబీఐ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2019 జూలై నుంచి యూబీఐ తమ ఎంసీఎల్‌ఆర్‌ను పెంచడం ఇది వరుగా 11వసారి. తాజా సవరణతో ఒకరోజు కాలపరిమితి కలిగిన రుణాల వడ్డీరేటు 7.30 శాతం నుంచి 7.15 శాతానికి (15 బేసిస్‌ పాయింట్లు), మూడునెలల వ్యవధి కలిగిన రుణాల వడ్డీరేటు 7.45 శాతం నుంచి 7.40 శాతానికి (5 బేసిస్‌ పాయింట్లు), ఆరునెలల కాలపరిమితి కలిగిన రుణాల వడ్డీరేటు 7.60 శాతం నుంచి 7.55 శాతానికి (5 బేసిస్‌ పాయింట్లు), ఏడాది వ్యవధి కలిగిన రుణాలపై వడ్డీరేటు 7.75 శాతం నుంచి 7.70 శాతానికి (5 బేసిస్‌ పాయింట్లు) తగ్గినట్టు యూబీఐ వివరించింది. మరోవైపు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ కూడా తమ గృహరుణాలతోపాటు ఆస్తి తనఖాపై ఇచ్చే రుణాల వడ్డీరేట్లను 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఈ రేట్లు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని ఆ సంస్థ తెలిపింది.
logo