శనివారం 30 మే 2020
Business - Apr 14, 2020 , 00:24:53

నిరుద్యోగ వైరస్‌!

నిరుద్యోగ వైరస్‌!

 • కరోనాతో ప్రపంచ ఆర్థికం  కుదేలు
 • అమెరికాలో భృతికోసం కోటిమంది దరఖాస్తు
 • యూరప్‌ దేశాల్లోనూ చేతులెత్తేసిన కంపెనీలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ ప్రపంచఆర్థిక వ్యవస్థను కకావికలం చేసింది. కొవిడ్‌ -19 దాదాపు అన్ని దేశాలనూ కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. అప్పటికే ఆర్థికమాంద్యంలోకి వెళ్లిపోతున్న దేశాలను.. కరోనా మాంద్యం మరింత కుంగదీసింది. ఆర్థిక ప్రగతి దేవుడెరుగు.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలు అనేలా చేసింది. కోట్లమంది ఉపాధిని ఉఫ్‌న ఊదేసింది. ఆస్ట్రియా నుంచి అగ్రరాజ్యం అమెరికా వరకు 1930 దశకంలో చవిచూసినదానికంటే ఎక్కువగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌వో) హెచ్చరించింది. ఉపాధి కోల్పోయిన వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకోసం పరుగులు పెడుతుండటం ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నది. రాత్రికి రాత్రి ఉపాధి దూరమై నిరుద్యోగ గ్రాఫ్‌ పైపైకి ఎగబాకుతున్నది. అమెరికా నెలసరి లేబర్‌ రిపోర్ట్‌ ప్రకారం.. గతనెలలో ఉపాధి కోల్పోవడం దశాబ్దకాలంలోనే గరిష్ఠమని తేలింది. ఆ దేశంలో అంచనాల కంటే ఏడురెట్లు నిరుద్యోగం పెరిగింది. ఇది ప్రభుత్వపరంగా అమలయ్యే సంక్షేమపథకాలపై నేరుగా ప్రభావాన్ని చూపింది. 2008-09 ఆర్థికమాంద్యం మొదటి ఆరున్నర నెలల్లో కంటే ఎక్కువగా.. ఈ రెండు వారాల్లోనే కోటి మందికిపైగా ఉపాధి కోల్పోయి ప్రభుత్వపథకాల ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. ఈ వారంలో ఏకంగా 15 శాతం నిరుద్యోగం నమోదు కానున్నదని అంచనావేస్తున్నారు. అన్ని దేశాల్లోనూ దాదాపు ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తున్నది.

పైపైకి నిరుద్యోగ గ్రాఫ్‌

 • ఫ్రాన్స్‌లో కూడా కంపెనీలు ప్రభుత్వ సాయం కోసం అర్థిస్తున్నాయి. నలభై లక్షల మంది కార్మికుల జీతాలకు సాయం చేయాలంటూ నాలుగు లక్షల కంపెనీలు దరఖాస్తు చేసుకొన్నాయి.
 • స్పెయిన్‌లో 14 శాతం నిరుద్యోగం 
 • బ్రిటన్‌లో గత రెండువారాల్లో పదిలక్షలమంది ప్రభుత్వ సంక్షేమపథకాలకోసం దరఖాస్తు చేసుకొన్నారు. సాధారణ పరిస్థితుల్లో కంటే ఇది పదిరెట్లు ఎక్కువ. ఆ దేశ గణాంకాల ప్రకారం వ్యాపారరంగంలో 27 శాతం సిబ్బందిని యాజమాన్యాలు తొలగించడంతో వారంతా ప్రభుత్వ పథకాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.  
 • ఫిన్‌లాండ్‌, నార్వేల్లో 6.20 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులుసహా ఎనిమిది లక్షల మంది ఉపాధి కోల్పోయారు.
 • జర్మనీలో ఏకంగా 4.70 లక్షల కంపెనీలు ప్రభుత్వసాయం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నది.
 • ఆస్ట్రియాలో 12 శాతం నిరుద్యోగిత నమోదవడం రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇదే మొదటిసారి.
 • జపాన్‌లోనూ ఉపాధి కోల్పోయినవారంతా అత్యవసర రుణాలు, ప్రభుత్వ కార్యక్రమాల కింద ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. 
 • గతనెల 28వ తేదీ నాటికి థాయిలాండ్‌ జనాభాలో మూడోవంతు అంటే 23 మిలియన్ల మంది ప్రభుత్వ ఆర్థిక సాయంకోసం దరఖాస్తు చేసుకున్నారు. సాధారణంగా తొమ్మిది మిలియన్ల మందికి మాత్రమే మూడునెలలపాటు 15 వేల బాత్‌ (455 డాలర్లు) సాయంగా అందిస్తారు. అంటే 2.5-3.00 రెట్లు అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. 
 • చైనాలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఫిబ్రవరిలో పట్టణ నిరుద్యోగమే 6.2 శాతం మేర పెరిగింది. 80 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్టు అంచనా.


logo