న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో నిరుద్యోగం కీలక సవాల్ గా మరోసారి ముందుకొచ్చింది. పదినెలల గరిష్టస్థాయిలో భారత్ లో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 12 శాతానికి ఎగబాకింది. ఏప్రిల్ 25 వారాంతంలో 9.55 శాతంగా ఉన్న పట్టణ నిరుద్యోగం మే 9తో ముగిసిన వారానికి ఏకంగా 11.72 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) డేటా వెల్లడించింది. ఇక జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు మే 9తో ముగిసిన వారానికి 8.67 శాతానికి పెరిగింది.
ఇదే సమయంలో గ్రామీణ నిరుద్యోగ రేటు 6.37 శాతం నుంచి 7.29 శాతానికి ఎగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ లో సీఎంఐఈ వెల్లడించిన డేటా ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు ఆందోళనకరంగా పెరిగింది. మరోవైపు కరోనా కట్టడికి రాష్ట్రాల్లో విధించిన లాక్డౌన్ లు మరికొంత కాలం కొనసాగితే రాబోయే వారాల్లో నిరుద్యోగ రేటు మరింత పెరుగుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. లాక్డౌన్ లతో అధికంగా అసంఘటిత రంగంలో ఉద్యోగాలు కనుమరుగవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. లాక్డౌన్ కారణంగా నిత్యావసరాలు మినహా ఇతర రంగాల్లో ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ పడిపోవడంతో ఆయా రంగాల్లో నిరుద్యోగం తలెత్తుతోంది.