గురువారం 04 మార్చి 2021
Business - Jan 18, 2021 , 22:21:41

నెదర్లాండ్ మీదుగా భారత్‌లోకి టెస్లా

నెదర్లాండ్ మీదుగా భారత్‌లోకి టెస్లా

న్యూఢిల్లీ‌: ఎలన్ మస్క్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు.. గ్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ కార్ల దిగ్గ‌జం టెస్లా సీఈవో. ఆయ‌న వ్యూహాలే డిఫ‌రెంట్‌. అనునిత్యం లాభాలు సంపాదించ‌డం వ్యాపార ల‌క్ష‌ణం. వాటిని పుణికిపుచ్చుకున్నాడా? అన్న‌ట్లు ఎల‌న్ మ‌స్క్ వ్య‌వ‌హ‌రించారు. ఈ ఏడాదిలోనే భార‌త్ మార్కెట్‌లోకి ప్ర‌వేశిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఎల‌న్‌మ‌స్క్‌.. భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. నెద‌ర్లాండ్ మీదుగా భార‌త్ విప‌ణిలోకి అడుగు పెట్ట‌నున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించారు. 

ఇంత‌కుముందు విదేశీ కంపెనీలు తమ యాజమాన్యాలు ఉన్న చోటు నుంచే భారత్‌లోకి ప్రవేశించాయి. 2017లో భారత్ ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడి పెట్టిన ఎంజీ మోటార్స్‌ చైనా నుంచి వచ్చింది. ఈ సంస్థ వాస్తవంగా బ్రిటన్‌ది. దీన్ని  చైనా సంస్థ ఎస్‌ఏఐసీ మోటార్స్‌ కొనుగోలు చేసింది. అలానే కియా మోటార్స్‌ పెట్టుబడులు నేరుగా దక్షిణ కొరియా నుంచి వచ్చాయి. ఆ దేశంలోనే కియా కార్పొరేట్‌ కార్యాలయం కూడా ఉంది. 

అయితే, సింగపూర్‌, మారిషస్‌తో ఉన్న పన్ను ఒప్పందాలను భారత్‌ సవరించింది. గతంలో ఈ రెండు దేశాల నుంచి భారత్‌కు ఒకప్పుడు భారీగా విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల రూపంలో ఎఫ్‌డీఐలు వచ్చేవి. కానీ, సవరణ తర్వాత ఆయా దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై మూలధన పన్నురాయితీలు తగ్గిపోయాయి. 

దీంతో పన్ను రాయితీలు పొందాలంటే మిగిలిన అత్యున్నత మార్గాల్లో నెదర్లాండ్స్‌ కూడా ఒకటి. ఈ దేశంతో గ‌ల‌ ఒప్పందం ప్రకారం ఆయా డచ్‌ కంపెనీలు భారతీయ విభాగాలను విదేశీకంపెనీలకు  విక్రయించినా మూలధన పన్ను మినహాయింపు లభిస్తుంది.  అంతేకాదు.. డివిడెండ్‌ ట్యాక్స్‌, విత్‌హోల్డింగ్‌ ట్యాక్స్‌లు కూడా చాలా తక్కువగా ఉంటాయి.   

టెస్లా మోటార్స్‌ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో రిజిస్టరైంది. దీని అనుబంధ సంస్థ టెస్లామోటార్స్‌ నెదర్లాండ్స్‌. కానీ, అమెరికా సంస్థలు నెదర్లాండ్స్‌ను ఎక్కువగా ఇష్టపడతాయి. ఆ కంపెనీలకు పన్ను రాయితీలు ఎక్కువగా ఇవ్వడం, మేధోహక్కుల సంరక్షణకు అక్క‌డ కఠిన చట్టాలు ఉండటమే అందుకు కారణం. క‌నుక ఇటీవల భారత్‌లో మస్క్‌ రిజిస్టర్‌ చేసిన టెస్లామోటార్స్‌ అండ్‌ ఎనర్జీ ఇండియాకు నెదర్లాండ్స్‌లోని టెస్లా మోటార్స్‌ నెదర్లాండ్స్‌ మాతృసంస్థగా వ్యవహరించనుంది.

ఈ నెల‌ 8వ తేదీన బెంగళూరులోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో టెస్లా మోటార్స్‌ అండ్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ కావ‌డంతో భారత మార్కెట్‌లోకి టెస్లా ప్ర‌వేశించిన‌ట్లైంది. దీనికి వైభవ్‌ తనేజా, వెంకట్రంగం శ్రీరామ్‌, డేవిడ్‌ జాన్‌ ఫైన్‌స్టైన్‌లు డైరెక్టర్లుగా వ్యహరించనున్నారు. ఇక‌ మరికొన్ని రాష్ట్రాల్లో కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు టెస్లా ప్రయత్నాలు చేస్తోంది. 

కర్ణాటకలో టెస్లా అడుగుపెట్టడంతో అక్కడి విద్యుత్‌ కార్ల తయారీ రంగానికి అదనపు బలం లభించినట్లైంది. ఇప్పటికే అక్కడ మహీంద్రా ఎలక్ట్రిక్‌, అధర్‌ ఎనర్జీ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. మరోపక్క పలు రాష్ట్రాలు కూడా విద్యుత్‌ వాహనాల ఉత్ప‌త్తికి అవ‌స‌ర‌మైన విధానాలు రూపొందిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo