సోమవారం 01 మార్చి 2021
Business - Feb 16, 2021 , 23:27:08

డీజిల్ నుంచి ఔట్ అయినా మారుతిదే పైచేయి!

డీజిల్ నుంచి ఔట్ అయినా మారుతిదే పైచేయి!

న్యూఢిల్లీ: అగ్ర‌శ్రేణి దేశీయ ప్ర‌యాణికుల కార్ల తయారీ సంస్థ మ‌రో రికార్డు న‌మోదు చేసింది. 2020లో అమ్ముడైన కార్ల‌లో స‌గం మారుతి సుజుకివే కావ‌డం గ‌మ‌నార్హం. మారుతి ఈ రికార్డును వరుసగా నాలుగోసారి కైవసం చేసుకొంది.  కంపెనీ డీజిల్ వాహనాల విక్రయం నుంచి గతేడాది వైదొలిగినా ఈ రికార్డును నిలబెట్టుకోవడం గమనార్హం.

మారుతీ కార్ల విక్రయాల్లో డీజిల్‌ వాహనాల వాటా దాదాపు 30శాతం ఉంటుంది. భారత్ విప‌ణిలోకి వచ్చిన సరికొత్త సంచలనాలు ఎంజీ మోటార్స్‌, కియాలను ఎదుర్కొని మారుతి సుజుకి ఈ మార్కెట్‌ వాటా సాధించడం విశేషం. ఇటీవల దేశీయంగా వేగంగా విస్తరిస్తున్న మిడ్ రేంజ్‌ ఎస్‌యూవీ విభాగంలో మారుతి పూర్తిగా అడుగుపెట్టలేదు. అందుకే ఈ సెగ్మెంట్లో మాత్రం హ్యూందాయ్‌, కియా కార్లు తమ స్థానాలను సుస్థిరం చేసుకొన్నాయి.

కార్ల విక్ర‌యాల్లో మారుతి సుజుకి చిన్నకార్ల విభాగంలో  67శాతం వాటా, సెడాన్ మోడ‌ళ్ల‌లో 50శాతం, ఎంయూవీల్లో 55శాతం, ఎస్‌యూవీల్లో 14శాతం, వ్యాన్లలో 98శాతం మార్కెట్‌ వాటా క‌లిగి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మారుతీ కార్ల విక్రయాలు 35శాతం నుంచి 41శాతానికి పెరగడం విశేషం.

ఒక ఎస్‌యూవీ విభాగంలో మినహా మారుతీ మిగిలిన అన్ని విభాగాల్లో మార్కెట్‌ వాటాను పెంచుకున్న‌దని కంపెనీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్స‌వ పేర్కొన్నారు. ‘‘కేవలం బ్రెజాతోనే ఎస్‌యూవీ విభాగంలో ముందు ఉండటం కష్టం. ఎస్‌క్రాస్‌ విక్రయాల సంఖ్య కూడా  పెరగాలి. కేవలం వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లు కార్ల  ఉత్పత్తితోనే మేం విజయం సాధించాం. దానిని భవిష్యత్‌లోనూ కొనసాగిస్తాం’’ అని శ్రీవాత్స‌వ పేర్కొన్నారు.  గతేడాది మారుతీ సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయలేదు. కానీ, తాజాగా బీఎస్‌-6 నిబంధనలు అమల్లోకి వచ్చాక కొత్తమోడళ్లపై కసరత్తును ముమ్మరం చేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo