గురువారం 22 అక్టోబర్ 2020
Business - Jun 12, 2020 , 00:17:30

పెట్టుబడులు పెట్టండి

పెట్టుబడులు పెట్టండి

  • కరోనా సంక్షోభాన్ని  ఓ అవకాశంగా మార్చుకోండి
  • వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ప్రధాని మోదీ పిలుపు

కోల్‌కతా, జూన్‌ 11: కరోనా వైరస్‌ సంక్షోభ పరిస్థితులను ఓ అవకాశంగా మలుచుకొని ‘ఆత్మనిర్భర్‌ భారత్‌' సృష్టికి కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు పిలుపునిచ్చారు. గురువారం ఇక్కడ జరిగిన ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 95వ వార్షిక ప్లీనరీలో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. సాహసోపేత నిర్ణయాలు, పెట్టుబడులకు ఇదే సరైన సమయమన్నారు. ‘గడిచిన ఐదారేండ్లుగా ప్రభుత్వ విధానాలు, కార్యాచరణలో భారత స్వావలంబన అతి ముఖ్యమైన లక్ష్యం. ఈ దిశగా మరింత వేగంతో ముందుకెళ్లాలని కరోనా వైరస్‌ చాటి చెప్పింది. ఈ గుణపాఠంతోనే ‘ఆత్మనిర్భర్‌ భారత్‌'ను మొదలుపెట్టాం’ అని అన్నారు. 

ఎగుమతులు చేయగలుగాలి

ప్రస్తుతం విదేశాల నుంచి వేటినైతే దిగుమతి చేసుకుంటున్నామో.. వాటినే ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్‌ ఎదుగాలని మోదీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న చిన్న ట్రేడర్లను మోదీ ప్రశంసించారు. ప్రజలతో, ప్రజల చేత, స్నేహపూర్వక అభివృద్ధిని నెలకొల్పడమే తమ ప్రభుత్వ ఆశయమన్నారు. 

పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వండి

పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలని పరిశ్రమకు మోదీ సూచించారు. ఆర్‌అండ్‌డీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మరింత విద్యుదుత్పత్తికి వీలుగా సోలార్‌ ప్యానెల్స్‌ నిల్వ సామర్థ్యం పెరిగేలా మెరుగైన బ్యాటరీలను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్‌ఈడీ బల్బుల వల్ల విద్యుత్‌ వినియోగం తగ్గడంతో ఏటా దాదాపు రూ.19 వేల కోట్లు ఆదా అవుతున్నాయని చెప్పారు.


logo