శుక్రవారం 27 నవంబర్ 2020
Business - Nov 07, 2020 , 02:29:58

లాసెట్‌లో 76.87 శాతం ఉత్తీర్ణత

లాసెట్‌లో 76.87 శాతం ఉత్తీర్ణత

  • అమ్మాయిలు 79.72, అబ్బాయిలు 69.40 శాతం 
  • ఫలితాలు విడుదలచేసిన ఉన్నత విద్యామండలి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఎస్‌ లాసెట్‌ ఫలితాల్లో 76.87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు పైచేయి సాధించారు. అబ్బాయిలు 79.72 శాతం, అమ్మాయిలు 69.40 శాతం మంది అర్హత సాధించారు.  న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం అక్టోబర్‌ తొమ్మిదిన జరిగిన టీఎస్‌ లాసెట్‌-2020 ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. లాసెట్‌ మూడేండ్లు, లాసెట్‌ ఐదేండ్లు, పీజీ లాసెట్‌ కోర్సులకు కలిపి మొత్తం 30,262 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. వారిలో 21,559 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 16,572 మంది అర్హత సాధించారు. అందులో అబ్బాయిలు 12,444, అమ్మాయిలు 4,127 మంది ఉన్నారు. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు పరీక్ష రాయగా.. ఒకరు అర్హత సాధించారు. హైకోర్టు అనుమతించిన ఇంటర్‌ విద్యార్థులకు ఐదేండ్ల లా కోర్సులో ప్రవేశాలు కల్పించాలని భావిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి చెప్పారు. ఈ మేర కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామ ని తెలిపారు. రాష్ట్రంలో మూడేండ్ల లా కోర్సు లో 3,909 సీట్లు, ఐదేండ్ల కోర్సులో 1340 సీట్లు, పీజీ లా కోర్సులో 620 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ, కన్వీనర్‌ జీబీరెడ్డి పాల్గొన్నారు. 

 త్వరలో ఎస్సీ ఉమెన్‌ గురుకుల లా కళాశాల

రాష్ట్రంలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం వేర్వేరుగా గురుకుల న్యాయ కళాశాలలు ఏ ర్పాటుచేయనున్నట్టు లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జీబీరెడ్డి తెలిపారు. త్వరలోనే ఎస్సీ మహిళా గురుకుల న్యాయ కళాశాలను 60 సీట్లతో ఘట్‌కేసర్‌లో ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. దీనికి బార్‌ కౌన్సిల్‌ నుంచి అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందులో 2020 -21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు ని ర్వహించే అవకాశాలున్నాయని చెప్పారు.