ఆదివారం 24 జనవరి 2021
Business - Nov 25, 2020 , 15:21:59

వ్యాక్సిన్ టూరిజం.. అమెరికా వ‌స్తే వ్యాక్సిన్ ఫ్రీ

వ్యాక్సిన్ టూరిజం.. అమెరికా వ‌స్తే వ్యాక్సిన్ ఫ్రీ

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని ఎంత‌లా గ‌డ‌గ‌డ‌లాడిస్తోందో మ‌న‌కు తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం అంద‌రూ వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. అమెరికాలో ఫైజ‌ర్ సంస్థ అతి త్వ‌ర‌లో వ్యాక్సిన్‌ను తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే ఇప్పుడీ వ్యాక్సిన్‌నే త‌మ మార్కెటింగ్ స‌ర‌కుగా వాడుకుంటున్నాయి కొన్ని ట్రావెలింగ్ ఏజెన్సీలు. త‌మ అమెరికా టూర్ ప్యాకేజీలో భాగంగా ఒక డోసు వ్యాక్సిన్ కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నాయి. అలాంటిదే వాట్సాప్‌లో చెక్క‌ర్లు కొడుతున్న ఒక మెసేజ్‌ను ఎడిల్‌వీస్ మ్యూచువ‌ల్ ఫండ్స్ సీఈవో రాధికా గుప్తా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. త‌మ‌తో అమెరికా వ‌చ్చే కొంద‌రు వీవీఐపీ ప్ర‌యాణికుల‌కు వ్యాక్సిన్ ఇస్తామ‌ని ఒక సంస్థ ఆ ప్ర‌క‌ట‌న‌లో చెప్ప‌డం విశేషం. ముంబై నుంచి న్యూయార్క్‌కు మూడు రోజులు, నాలుగు రాత్రుల ప్యాకేజ్ ఇది. ఇందులో విమాన ఛార్జీలు, హోట‌ల్ ఖ‌ర్చుల‌తోపాటు ఒక డోసు వ్యాక్సిన్ కూడా ఇస్తామ‌ని ఆ సంస్థ చెబుతోంది. ఈ ప్యాకేజ్ రేటును రూ.1,74,999గా నిర్ధారించారు. డిసెంబ‌ర్ 11న అమెరికాలో తొలి వ్యాక్సిన్ రావ‌చ్చ‌ని, ఆ వ్యాక్సిన్ కొంత‌మంది ఎంపిక చేసిన వీవీఐపీ క్లైంట్స్‌కు ఇస్తామ‌ని ఆ సంస్థ అంటోంది. ముందుగా ఈ ప్యాకేజ్‌ను బుక్ చేసుకున్న కొంత మందికి మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ ఇస్తోంది. ఈ ప్ర‌క‌ట‌నను ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ అప్పుడే వ్యాక్సిన్ టూరిజం మొద‌లైంద‌ని రాధికా గుప్తా కామెంట్ చేశారు.


logo