మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 16, 2020 , 00:21:12

రుణ వ్యవస్థ బలపడింది

రుణ వ్యవస్థ బలపడింది
  • మార్కెట్‌లోకి నగదు ప్రవాహం
  • పుంజుకుంటున్న వినియోగ సామర్థ్యం
  • ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనంపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో రుణ వ్యవస్థ బలపడిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. ప్రైవేట్‌ రంగానికి నిధుల కొరత రాకుండా బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పెరిగాయని తెలిపారు. రుణాల మంజూరు పెరిగితే వినియోగదారుల వద్ద నగదు పెరుగుతుందని, దీనివల్ల మార్కెట్‌లో డిమాండ్‌ ఊపందుకుని, జీడీపీ పుంజుకునే వీలుంటుందన్నారు. వడ్డీరేట్ల కోతల ప్రయోజనం కూడా పూర్తిగా అందితే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ ఆర్బీఐ కేంద్ర బోర్డు 582వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌, వ్యయ కార్యదర్శి టీవీ సోమనాథన్‌, ఇతర ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారులు, బోర్డు సభ్యులు హాజరైయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఈ నెల 1న పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన తొలి ఆర్బీఐ బోర్డు సమావేశం ఇదే. దీంతో ఈ సందర్భంగా వివిధ బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చ జరిగింది.


ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావం ఉండదు

ద్రవ్యోల్బణంపై బడ్జెట్‌ ప్రభావం పెద్దగా ఉండబోదని దాన్‌ అన్నారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో దిగొస్తున్న ముడి చమురు ధరలు.. ద్రవ్యోల్బణం కట్టడికి కలిసొస్తాయని అభిప్రాయపడ్డారు. కాగా, జీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యాలను కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. 3.3 శాతం నుంచి 3.8 శాతానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఫిస్కల్‌ రెస్పాన్సిబులిటి అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టంలోని ‘ఎస్కేప్‌ క్లాజ్‌'ను కేంద్రం వాడుకుంటున్నదన్నారు. ఆర్థిక వ్యవస్థలో తీవ్ర ఒత్తిడి ఉన్నప్పుడు ద్రవ్యలోటు లక్ష్యాన్ని 0.5 శాతం సవరించడానికి కేంద్రానికి వెసులుబాటును ఇది కలిగిస్తుందని చెప్పారు.


ఆర్బీఐ ఆర్థిక సంవత్సరంపై..

ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సంవత్సరాన్నే (ఏప్రిల్‌-మార్చి) ఆర్బీఐ కూడా పాటించాలని బోర్డు ఈ సందర్భంగా సిఫార్సు చేసింది. ప్రస్తుతం జూలై-జూన్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా ఆర్బీఐ పాటిస్తున్నది. దీంతో ఏప్రిల్‌-మార్చి కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించాలని, వచ్చే 2020-21 నుంచే అది జరుగాలని ఆర్బీఐ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు సూచించారు. దీన్ని ఆమోదించిన బోర్డు.. ప్రభుత్వ పరిశీలనకు పంపింది. ఇదిలావుంటే ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు ఆదేశంపట్ల ఆర్బీఐ గవర్నర్‌ దాస్‌ స్పందిస్తూ దీనిపై ఏదైనా అభ్యంతరాలుంటే అంతర్గతంగా చర్చిస్తామన్నారు. టెలికం సంస్థలు మూతబడితే బ్యాంకర్ల మొండి బకాయిలు పెరుగవచ్చన్న అంచనాల నేపథ్యంలో దాస్‌ పైవిధంగా స్పష్టం చేశారు.


logo
>>>>>>