Toyota Yaris Discontinued | దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకున్నది. భారత మార్కెట్లో సెడాన్ మోడల్ యారిస్ తయారీతోపాటు విక్రయాలను నిలిపేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ రోజు అంటే సెప్టెంబర్ 27 నుంచే అమలులోకి వస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు ఈ కారు కొనుగోలు చేసిన కస్టమర్లకు సర్వీస్, విడి భాగాలు అందిస్తామని హామీ ఇచ్చింది.
తమ సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల సర్వీస్ సెంటర్ల ద్వారా యారిస్ కార్ల యజమానులకు సేవల్లో ఏ అంతరాయం ఉండదు. నిలిపేసిన యారిస్ మోడల్ కారు విడి భాగాలను కనీసం పదేండ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. 2018 ఏప్రిల్లో యారిస్ కారును టయోటా కిర్లోస్కర్ ఆవిష్కరించింది. హోండా సిటీకి పోటీగా ఇది మార్కెట్లోకి వచ్చింది. ఇక వచ్చే ఏడాది కొత్త మోడల్ కార్ల ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తున్నట్లు టయోటా వివరించింది.