బాబోయ్.. మొండి బాకీలు

- బ్యాంకింగ్ రంగంలో నిరర్థక రుణాలు భారీగా పెరుగవచ్చంటున్న ఎస్అండ్పీ
- వచ్చే ఏడాదిన్నర కాలంలో 11 శాతానికి చేరవచ్చని హెచ్చరిక
భారతీయ బ్యాంకింగ్ రంగానికి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ఓవైపు కార్పొరేట్ల ఎగవేతలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో సంక్షోభంలో చిక్కుకున్న దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకు.. ఇప్పుడు కరోనా కారణంగా నిరర్థక రుణాల ముప్పు పొంచి ఉన్నది. రాబోయే ఏడాది ఏడాదిన్నర కాలంలో మొండి బకాయిలుగా మారే రుణాలు 11శాతం వరకు పెరిగే వీలుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా లక్షల కోట్ల ఉద్దీపనలు హుష్‌కాకి.
న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశీయ బ్యాంకింగ్ రంగంలో నిరర్థక రుణాలు (ఎన్పీఎల్) భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే 12-18 నెలల్లో ఇవి మొత్తం రుణాల్లో 11 శాతానికి చేరొచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ తెలిపింది. కొవిడ్-19తో దేశ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న మందగమనం.. రుణాల చెల్లింపులను ప్రభావితం చేస్తున్నదని పేర్కొన్నది. ‘భారతీయ ఆర్థిక సంస్థల్లో ఒత్తిడి బీటలు’ పేరుతో ఎస్అండ్పీ తాజా నివేదికను విడుదల చేసింది. ఇందులో 6 నెలల మారటోరియం రుణగ్రహీతలకు ఏమంత ఊరటనివ్వలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది-ఏడాదిన్నర కాలంలో మొత్తం బ్యాంక్ రుణాల్లో నిరర్థక రుణాల వాటా 10-11 శాతానికి చేరుకునే ప్రమాదం ఉందన్నది. ఈ ఏడాది జూన్ చివరినాటికి 8 శాతంగానే ఉన్నాయి.
రుణాల పునర్వ్యవస్థీకరణ
మొత్తం రుణాల్లో 3 నుంచి 8 శాతం రుణాలు పునర్వ్యవస్థీకరణకు వీలుగా ఉన్నాయని ఎస్అండ్పీ తెలిపింది. ఈ రుణాలను రీస్ట్రక్చర్ చేయకపోతే వసూళ్లు కష్టమేనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు ఆస్తుల పునర్వ్యవస్థీకరణ సంస్థ (ఏఆర్సీ)లకు బ్యాంకులు భారీగానే మొండి బకాయిలను విక్రయించే అవకాశాలున్నాయని ఎస్అండ్పీ పేర్కొన్నది.
మోదీ హయాంలో బ్యాంకులు కుదేలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో భారతీయ బ్యాంకులు కుదేలయ్యాయి. కార్పొరేట్ల రుణ ఎగవేతలు, పాత పెద్ద నోట్ల రద్దు, ప్రైవేటీకరణ, విలీనాలు ఇలా ఎన్నో పరిణామాలు.. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేశాయి. ప్రస్తుతం భారతీయ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల వాటా రూ.11 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఇందులో 90% ప్రభుత్వ బ్యాంకులవే కావడం గమనార్హం. పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్, యెస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ల సంక్షోభానికి కేంద్రం తప్పుడు విధానాలే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. తాజాగా కార్పొరేట్లకు బ్యాంకులను కట్టబెట్టాలన్న ఆర్బీఐ నిపుణుల కమిటీ సిఫార్సులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ సిఫార్సులను బుట్టదాఖలు చేయాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య సూచిస్తుండటం బ్యాంకింగ్ రంగంపై మోదీ సర్కారు పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపుతున్నది.