ఆదివారం 29 మార్చి 2020
Business - Jan 18, 2020 , 00:59:30

జీఎమ్మార్‌ చేతికి విదేశీ ప్రాజెక్టులు?

 జీఎమ్మార్‌ చేతికి విదేశీ ప్రాజెక్టులు?
  • -మోంటెనెగ్రో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుల రేసులో ముందంజ

హైదరాబాద్‌, జనవరి 17: మోంటెనెగ్రో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుల బరిలో జీఎమ్మార్‌ ముందంజలో ఉన్నది. ఈ దక్షిణ యూరప్‌ దేశంలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల ప్రాజెక్టులను దక్కించుకునేందుకు పోటీపడుతున్న ప్రపంచ సంస్థల్లో జీఎమ్మార్‌ దూసుకుపోతున్నది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి అర్హత సాధించిన నలుగురు బిడ్డర్లలో జీఎమ్మార్‌ ఒకటిగా నిలిచింది. జీఎమ్మార్‌ గ్రూప్‌నకు చెందిన జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌, ఇంచెన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కార్పొరేషన్‌, గ్రూప్‌ ఏడీపీ కన్సార్టియం, కార్పొరేషన్‌ అమెరికా ఎయిర్‌పోర్టులు క్వాలిఫైడ్‌ బిడ్డర్లుగా ఉన్నాయని మోంటెనెగ్రో రవాణా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రీ-క్వాలిఫికేషన్‌ ప్రమాణాలను, డాక్యుమెంటేషన్‌ను ఈ నాలుగు సంస్థలు సక్రమంగా పాటించాయని, దీంతో వీటిని క్వాలిఫైడ్‌ బిడ్డర్లుగా ప్రకటిస్తున్నామని ఈ నెల 15న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మోంటెనెగ్రో రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.


ప్రీ-క్వాలిఫికేషన్‌ దశకు ఏడు సంస్థలు చేరుకోగా, ఇందులో నాలుగు క్వాలిఫైడ్‌ బిడ్డర్లుగా నిలిచాయి. పోడ్గోరికా, తివట్‌లలో ఈ రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలను మోంటెనెగ్రో ఏర్పాటు చేస్తున్నది. వీటి కోసమే 30 ఏండ్ల కాంట్రాక్టులో భాగంగా బిడ్లను ఆహ్వానించారు. మోంటెనెగ్రో దేశంలోని విమానాశ్రయాలను ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్‌ ఆఫ్‌ మోంటెనెగ్రో జేఎస్‌సీ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో నిరుడు జూలై 25న కొత్త ప్రాజెక్టుల కోసం ప్రైవేట్‌ భాగస్వాములను ఎంపిక చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాలకుపైగా కాలంలో కనీసం 200 మిలియన్‌ యూరోల ఆస్తులను కలిగి ఉన్నట్లు ప్రకటించిన సంస్థలే ఈ బిడ్డింగ్‌కు అర్హులు అని తెలిపింది.

ఒంటరిగా కాకుండా కూటమిగా బిడ్లను సమర్పించాలంటే సదరు కన్సార్టియంకు 400 మిలియన్‌ యూరోల ఆస్తులుండాలని స్పష్టం చేసింది. జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌.. న్యూఢిల్లీ, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తుండగా, ఫిలిప్పీన్స్‌లో మెగావైడ్‌ సంస్థ భాగస్వామ్యంతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నది. దేశీయంగా గోవాలో, అంతర్జాతీయంగా హెరాక్లియోన్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుకూ లైన్‌క్లియర్‌ చేసుకున్నది. 


logo