సోమవారం 01 మార్చి 2021
Business - Dec 25, 2020 , 01:38:55

లాభాల హోరు

లాభాల హోరు

ముంబై: స్టాక్‌ మార్కెట్ల జోరు కొనసాగుతున్నది. వరుసగా మూడోరోజు దేశీయ సూచీలు చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతండటంతో ఒక దశలో రికార్డు స్థాయికి ఎగబాకాయి. చివరకు 529.36 పాయింట్లు లేదా 1.14 శాతం ఎగబాకి 46,973.54 పాయింట్లకు చేరుకోగా, జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ 148.15 పాయింట్లు అందుకొని 13,749.25 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 47,050 పాయింట్లు దాటి రికార్డు స్థాయికి ఎగబాకింది. వారాంతం ట్రేడింగ్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ 3 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కొటక్‌ బ్యాంక్‌ల షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. మార్కెట్‌ లాభంలో ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వాటా సగం కావడం విశేషం. మరోవైపు ఇన్ఫోసిస్‌, నెస్లె ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు 1.32 శాతం వరకు కోల్పోయాయి. రంగాలవారీగా చూస్తే ఎనర్జీ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌, టెలికం రంగ సూచీలు రెండు శాతానికి పెరుగగా..ఐటీ, రియల్టీ, టెక్‌ రంగ షేర్లు నష్టపోయాయి. 

నేడు మార్కెట్లకు సెలవు

క్రిస్మస్‌ సందర్భంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకు పరిమితమైంది. అలాగే ఈవారంలో సెన్సెక్స్‌ 12.85 పాయింట్లు, నిఫ్టీ 11.30 పాయింట్లు లాభపడ్డాయి. 

VIDEOS

logo