గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 08, 2021 , 17:44:09

ఫేస్‌బుక్‌తో పోటీకి టిక్‌టాక్‌ యోచన

ఫేస్‌బుక్‌తో పోటీకి టిక్‌టాక్‌ యోచన

వాషింగ్టన్‌: చైనాకు చెందిన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌, ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌తో పోటీపడాలని యోచిస్తున్నది. అమెరికాలో ఈ-కామర్స్‌ రంగంలో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో 2021కు సంబంధించిన సంస్థ ప్రణాళికలు, కొత్త ఫీచర్ల గురించి ప్రకటనదారులకు వివరించింది. అత్యంత ప్రజాదరణ పొందిన వినియోగదారులు వివిధ ఉత్పత్తులకు సంబంధించిన లింక్‌లను షేర్‌ చేసి వాటి అమ్మకాలపై కమీషన్‌ సంపాదించేందుకు అనుమతించనున్నట్లు పేర్కొంది. అయితే ఈ విధానం పాత అనుబంధ మార్కెటింగ్‌కు సంబంధించినదని ఒక సీనియర్‌ అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. వీడియో తయారీదారులు తమకు నచ్చిన ఏదైనా ఉత్పత్తులను లింక్‌ చేయడం ద్వారా ఆదాయం సంపాదించవచ్చని  ఆయన పేర్కొన్నారు. 

మరోవైపు పలు బ్రాండ్స్‌కు చెందిన ఉత్పత్తుల కేటలాగ్‌లను తమ ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించే సామర్థ్యాన్ని కూడా రూపొందించాలని చైనాలోని బైట్‌డాన్స్‌ యాజమాన్యానికి చెందిన టిక్‌టాక్‌ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ నివేదిక తెలిపింది. అంతేగాక టెలివిజన్ షాపింగ్ ఛానెల్స్‌, మొబైల్ ఫోన్‌లో ‘లైవ్‌స్ట్రీమ్డ్’ షాపింగ్‌ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. దీంతో టిక్‌టాక్‌ తారలు ప్రదర్శించే ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. దీని కోసం గత ఏడాది చివరలో వాల్‌మార్ట్‌ ప్రకటించిన లైవ్ షాపింగ్ ఫీచర్‌ను టిక్‌టాక్‌ అనుసరిస్తున్నది.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ షాపిఫైతో భాగస్వామ్యాన్ని ఇప్పటికే ప్రకటించిన టిక్‌టాక్‌, ఇలాంటి ఫీచర్స్‌ కలిగిన ఫేస్‌బుక్‌తో మరింత పోటీపడాలని భావిస్తున్నది. ఫేస్‌బుక్‌ గత ఏడాది కొన్ని దేశాలలో తన ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రజలు వస్తువులను సులభంగా కొనుగోలు చేసే  సాధనాలను ప్రవేశపెట్టింది. ఫేస్‌బుక్ ప్రధాన సైట్‌లో డిజిటల్ షాపింగ్ ఛానెల్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఫీచర్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఫేస్‌బుక్‌కు గట్టి పోటీ ఇవ్వాలని టిక్‌టాక్‌ యోచిస్తున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo