శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 28, 2021 , 00:04:00

భారత్‌కు టిక్‌టాక్‌ గుడ్‌బై

భారత్‌కు టిక్‌టాక్‌ గుడ్‌బై

2 వేల మంది ఉద్యోగులపై ప్రభావం: బైట్‌డ్యాన్స్‌

న్యూఢిల్లీ, జనవరి 27: చైనా సామాజిక మాధ్యమ సంస్థ బైట్‌డ్యాన్స్‌ ఆధీనంలోని టిక్‌టాక్‌, హలో యాప్‌లు భారత్‌కు గుడ్‌బై చెప్పనున్నాయి. భారత్‌లో వీటి వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని బైట్‌డ్యాన్స్‌ నిర్ణయించింది. ఈ మేరకు బైట్‌డ్యాన్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. సిబ్బంది సంఖ్యను తగ్గించాలనుకుంటున్నామని, దీని ప్రభావం భారత్‌లోని మొత్తం 2 వేల మంది సిబ్బందిపై పడుతుందని టిక్‌టాక్‌ గ్లోబల్‌ ఇంటెరిమ్‌ హెడ్‌ వనెస్సా పప్పాస్‌, గ్లోబల్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బ్లేక్‌ చాండ్లీ సంయుక్త ఈ-మెయిల్‌ ద్వారా తమ ఉద్యోగులకు తెలిపారు. భారత్‌లో మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించాలని తమ కంపెనీ ఎదురు చూస్తున్నదని పేర్కొంటూ.. అది ఎప్పుడన్న దానిపై అనిశ్చితిని వ్యక్తం చేశారు. తమ కార్యకలాపాలు భారత చట్టాలకు అనుగుణంగా ఉండేలా అన్ని ప్రయత్నాలు చేశామని, అయినప్పటికీ తమ యాప్‌ల పునఃప్రారంభంపై గత 7 నెలలుగా ఎలాంటి స్పష్టత రాలేదని అన్నారు. నిషేధ సమయంలో తమకు అండగా నిలిచిన భారతీయ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.

VIDEOS

logo