శుక్రవారం 10 జూలై 2020
Business - May 30, 2020 , 00:27:03

విప్రో చీఫ్‌గా డెలాపోర్ట్‌

విప్రో చీఫ్‌గా డెలాపోర్ట్‌

  • -జూలై 6న బాధ్యతలు స్వీకరించనున్న క్యాప్‌జెమినీ ఉన్నతాధికారి

న్యూఢిల్లీ, మే 29: ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా థియర్రీ డెలాపోర్ట్‌ నియమితులయ్యారు. క్యాప్‌జెమినీ గ్రూపు ఉన్నతాధికారైన డెలాపోర్ట్‌ జూలై 6న పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం కంపెనీ సీఎండీగా వ్యవహరిస్తున్న అబిదాలీ జెడ్‌ నీముచ్‌వాలా వచ్చే నెల 1 నుంచి తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఆయన స్థానాన్ని డెలాపోర్ట్‌ భర్తిచేయనున్నారు. నీముచ్‌వాలా వైదొలిగిన నాటి నుంచి జూలై 5 వరకు రిషద్‌ ప్రేమ్‌జీ  చీఫ్‌గా వ్యవహరించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలలో వెల్లడించింది. ఒక అతిపెద్ద ఐటీ కంపెనీకి అధిపతిగా వ్యవహరించబోతున్న తొలి విదేశీయుడు డెలాపోర్ట్‌ కావడం విశేషం. ఆయన పారిస్‌కు చెందినవారు. దాదాపు 25 ఏండ్లపాటు క్యాప్‌జెమినీలో వివిధ హోదాల్లో పనిచేసిన డెలాపోర్ట్‌.. ఇటీవల చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారిగా పదోన్నతి పొందారు. దేశీయ ఐటీ రంగంలో తమదైన ముద్రవేస్తున్న ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌, విప్రో సీఈవోగా నియమితులైన డెలాపోర్ట్‌ ఇద్దరూ క్యాప్‌జెమినీ ఉన్నతాధికారులు కావడం విశేషం. ‘డెలాపోర్ట్‌కు ఉన్న నాయకత్వ లక్షణాలు, అంతర్జాతీయ అనుభవం, వినియోగదారులతో సత్సంబంధాల విషయంలో నేర్పు, సంస్థలో సమూల మార్పులు, చేర్పులు, సమస్యలను పరిష్కరించడంలో ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని  విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ ఈ సందర్భంగా చెప్పారు. అలాగే సంస్థను మరోమెట్టు ఎక్కించడానికి ఆయనే సరౌన వ్యక్తి అని తెలిపారు.  డెలాపోర్ట్‌ మాట్లాడుతూ.. రిషద్‌తోపాటు ఉన్నతాధికారులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. సంస్థను నూతన శిఖరాలకు చేర్చేందుకు తనవంతు కృషి చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు దీపక్‌ ఎం సత్వాలెకర్‌ను బోర్డు సభ్యుడిగా సంస్థ నియమించుకున్నది. 


logo