న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కొవిడ్-19లా ప్రపంచానికి చైనా నుంచి మరో ముప్పు వచ్చే సంకేతాలు కన్పిస్తున్నాయి. దశాబ్దకాలం క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని కుదిపేసిన లేమాన్ బ్రదర్స్ తరహా సంక్షోభం మరోటి చైనా నుంచి రాబోతుందన్న భయాలు ప్రస్తుతం ఫైనాన్షియల్ మార్కెట్లలో బాగా పెరిగాయి. ఈ ప్రభావంతోనే ఈక్విటీలు, బాండ్లు, వర్థమాన దేశాల కరెన్సీలు ఒక్కసారిగా పతనబాట పట్టాయి. చైనాలో రెండో అతిపెద్ద రియల్టీ కంపెనీ ఎవర్‌గ్రాండే దివాలా తీస్తుందన్న ఆందోళన మార్కెట్లలో సోమవారం మరీ పెరిగిపోయింది. 305 బిలియన్ డాలర్ల మేర రుణ (దాదాపు రూ.23 లక్షల కోట్లు) చెల్లింపుల్ని చేయాల్సిఉన్న ఎవర్‌గ్రాండే ఈ సెప్టెంబర్ 23, 29 తేదీల్లో బాండ్లకు వడ్డీలు చెల్లించాల్సివుంది. ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితిలో కూడా లేని ఎవర్‌గ్రాండే వచ్చే కొద్దిరోజుల్లో వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే కంపెనీ బాండ్లు డిఫాల్ట్ క్యాటగిరీల్లోకి చేరిపోతాయి. దాంతో ఆ కంపెనీకి రుణాలిచ్చిన ఆర్థిక సంస్థలు, ఫండ్స్ సంక్షోభంలో కూరుకుపోయి, ప్రపంచ మార్కెట్లు, తద్వారా కంపెనీలు అల్లాడిపోతాయి. లేమాన్ బ్రదర్స్‌ను అమెరికా ప్రభుత్వం ఆదుకోకపోవడంతో ఆ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కుప్పకూలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన పరిణామం ఇప్పుడు మార్కెట్లను కలవరపరుస్తున్నది.
ఇండియా స్టీల్ రంగంపై తొలి దెబ్బ…
ఎవర్గ్రాండేతో పాటు చైనా రియల్టీ రంగం ఇక్కట్లు ఇండియా స్టీల్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం టాటా స్టీల్ షేరు 10 శాతం కుప్పకూలింది. వారంరోజులుగా ఈ షేరు 29 శాతం మేర పడిపోయింది. జిందాల్ స్టీల్, జెఎస్డబ్ల్యూ స్టీల్, సెయిల్ తదితర ఉక్కు షేర్లు సైతం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దేశీ ఉక్కు కంపెనీలు వాటి ఉత్పత్తుల్ని చైనాకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నందున, తాజా సంక్షోభంతో వాటి ఆదాయాలు తగ్గుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ ఎన్ఎండీసీ షేరు కూడా తాజాగా 7 శాతం క్షీణించింది. ఇతర మైనింగ్ షేర్లు హిందాల్కో, వేదాంతలు 5 శాతంపైగా నష్టపోయాయి.
1300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు
చైనాలో కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ తర్వాత ఎవర్‌గ్రాండే పెద్ద రియల్టీ కంపెనీ. ఇది ఆ దేశంలో 260 నగరాల్లో 1300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్ని ప్రస్తుతం అమలుచేస్తోంది. దాదాపు 15 లక్షల మందికి ఇళ్లు కట్టించిఇవ్వడానికి ప్రజల నుంచి డబ్బు కూడా వసూలుచేసింది. అయితే కొద్ది నెలల నుంచి చైనా రియల్టీ మార్కెట్ మందగించడంతో ఎవర్‌గ్రాండేపై ప్రభావం పడింది. దాంతో ఉద్యోగులకు జీతాలు, మెటీరియల్ సరఫరా దారులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో పడిపోయింది. ఎవర్‌గ్రాండే బాండ్ల ధరలు కుప్పకూలడంతో పాటు వివిధ చైనా రియల్టీ కంపెనీల బాండ్ల ధరలు కూడా క్షీణించి, వాటి ఈల్డ్స్ బాగా పెరిగాయి. ఈ బాండ్లలో పెట్టుబడిచేసిన బ్లాక్‌రాక్, యూబీఎస్, గోల్డ్‌మాన్ శాక్స్ తదితర పలు ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ప్రస్తుతం సంకటస్థితిలో పడిపోయాయి.