గురువారం 26 నవంబర్ 2020
Business - Jun 21, 2020 , 02:32:03

శానిటైజర్లకు గిరాకీ

శానిటైజర్లకు గిరాకీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా శానిటైజర్ల వినియోగం భారీగా పెరిగింది. కరోనాకు ముందు శానిటైజర్ల వినియోగం కేవలం దవాఖానల్లోనే ఉండేది. వాటి అవసరాల మేరకు రాష్ట్రంలో ఐదారు కంపెనీలు శానిటైజర్లను ఉత్పత్తి చేసేవి. నేడు దాదాపు అందరూ శానిటైజర్‌ వినియోగిస్తుండటంతో 120కిపైగా కంపెనీలు తయారుచేస్తున్నాయి. ప్రభుత్వం కూడా శానిటైజర్లు ముందుకొచ్చిన కంపెనీలన్నింటికీ అనుమతులిచ్చింది. కొన్ని కంపెనీలు అవి ఉత్పత్తి చేసే వస్తువులకు లాక్‌డౌన్‌ కారణంగా డిమాండ్‌ తగ్గడంతో శానిటైజర్ల తయారీ వైపు మొగ్గుచూపాయి. ఆబ్కారీ శాఖ కూడా కొన్ని డిస్టిలరీలకు శానిటైజర్‌ తయారీకి అనుమతినిచ్చింది. 

నాణ్యతపై అనుమానాలు

మార్కెట్‌లో శానిటైజర్లకున్న డి మాండ్‌, ఇబ్బడిముబ్బడిగా వచ్చిన సంస్థల దృష్ట్యా నాణ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కొందరు మిథనాల్‌ కలుపుతున్నారని, దీంతో చర్మసంబంధ వ్యాధులు వచ్చే వీలుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాటి నాణ్యతను తనిఖీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 200 మిల్లీ లీటర్ల శానిటైజర్‌ను గరిష్ఠంగా రూ.100కు విక్రయించాలని సూచించింది. 

‘కరోనాతో ఒక్కసారిగా శానిటైజర్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే కొన్ని కంపెనీలు సరైన ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తున్నాయి. వీటివల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది’.              

- రంగారెడ్డి, శాన్‌మెడ్‌ హెల్త్‌కేర్‌ వ్యవస్థాపకుడు