తగ్గిన జీడీపీ క్షీణత

- రెండో త్రైమాసికంలో మైనస్ 7.5 శాతం
- తయారీ రంగం మెరుగుపడటమే ప్రధాన కారణం
న్యూఢిల్లీ, నవంబర్ 27: ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2020-21) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)తో పోలిస్తే రెండో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణత గణనీయంగా తగ్గింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2)లో ఈ క్షీణత 7.5 శాతానికి పరిమితమైంది. కానీ గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ 4.4 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ఈసారి క్యూ2లో జీడీపీ క్షీణత తగ్గడానికి తయారీ రంగం మెరుగుపడటమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ల వల్ల ఆర్థిక కార్యకలాపాలు దాదాపు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా తొలి త్రైమాసికంలో జీడీపీ కనీవినీ ఎరుగని రీతిలో 23.9 శాతం క్షీణించిన విషయం విదితమే. కానీ జూన్ నుంచి లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలించడంతో జీడీపీ క్షీణత తగ్గుతున్నట్టు శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం తొలి త్రైమాసికంలో భారీగా 39 శాతం కుంచించుకుపోయిన తయారీ రంగం.. రెండో త్రైమాసికంలో అనూహ్యంగా 0.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే వ్యవసాయ రంగం చక్క టి ప్రదర్శనను కొనసాగించి 3.4 శాతం వృద్ధి చెందింది. కానీ వాణిజ్య, సేవల రంగంలో క్షీణత అంచనాల కంటే తగ్గి 15.6 శాతానికి పరిమితమైంది. అలాగే ప్రభుత్వ వ్యయం 12 శాతం తగ్గినట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మరింత పెరిగిన ద్రవ్యలోటు
కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు మరింత పెరిగింది. గత నెలాఖరుకల్లా వార్షిక బడ్జెట్ అంచనాలో 119.7 శాతానికి చేరింది. అక్టోబర్ ముగింపు నాటికి రూ.9,53,154 కోట్లుగా ఉన్నట్లు శుక్రవారం అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. సెప్టెంబర్ 30న ఇది 114.8 శాతంగా ఉండగా, నెల రోజుల్లో దాదాపు 5 శాతం ఎగిసింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) బడ్జెట్లో వేసిన ఆదాయం అంచనాలో అక్టోబర్‌కల్లా 31.54 శాతం (రూ.7,08,300 కోట్లు) సాధ్యమైందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) తెలిపింది. ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య తేడానే ద్రవ్యలోటుగా పరిగణిస్తామన్న విషయం తెలిసిందే.
కీలక రంగాలు నిరాశాజనకంగానే..
వరుసగా ఎనిమిది నెలలుగా ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్న కీలక రంగాలు కాస్త మెరుగుపడ్డాయి. గత నెలకుగాను వృద్ధి 2.5 శాతానికి పడిపోయిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, స్టీల్ రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో వృద్ధిలో క్షీణత నమోదైంది. ఏడాది క్రితం ఇదే నెలలో కీలక రంగాలు 5.5 శాతం వృద్ధిని సాధించాయి. బొగ్గు, ఎరువులు, సిమెంట్, విద్యుత్ రంగాలు సానుకూల వృద్ధిని నమోదు చేయగా.. క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, స్టీల్‌లు మాత్రం వెనుకబడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో కీలక రంగాలు మైనస్ 13 శాతానికి జారుకున్నాయి.
తాజావార్తలు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
- ఆరోగ్యానికి లైవ్ చేపలే మేలు
- వ్యాక్సిన్‌పై భయం వద్దు
- నంబర్ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా
- విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్
- ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి