సోమవారం 01 మార్చి 2021
Business - Jan 05, 2021 , 13:26:51

బంగారాన్నే మించిపోతున్న బిట్‌కాయిన్.. ఎందుకిలా?

బంగారాన్నే మించిపోతున్న బిట్‌కాయిన్.. ఎందుకిలా?

పాపులర్ క్రిప్టో క‌రెన్సీ బిట్‌కాయిన్ అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్తోంది. ఏకంగా దాని విలువ రికార్డు స్థాయిలో 34 వేల డాల‌ర్ల (రూ.25 ల‌క్ష‌లకు పైనే)ను తాకింది. 2018లో కుప్ప‌కూలిన ఇదే బిట్‌కాయిన్ 2020లో మాత్రం ఏకంగా 800 శాతం పెరిగిపోయింది. ప్ర‌పంచవ్యాప్తంగా బ‌డా పెట్టుబ‌డిదారులు కూడా ఇప్పుడు బంగారాన్ని వ‌దిలి మెల్ల‌గా బిట్‌కాయిన్ వైపు అడుగులు వేస్తున్నారంటేనే ఈ క్రిప్టోక‌రెన్సీ హ‌వా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌పంచంలో ఏదైనా సంక్షోభం వ‌స్తే చాలు.. ఇన్వెస్ట‌ర్ల చూపు ముందుగా ప‌డేది బంగారంపైనే. కానీ ఇప్పుడా బంగారం కూడా బిట్‌కాయిన్ దెబ్బ‌కు వ‌ణికిపోతోంది. 

క‌లిసొచ్చిన క‌రోనా

గ‌తేడాది క‌రోనా మ‌హమ్మారి ప్ర‌పంచాన్ని క‌కావిక‌లం చేసింది. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలాయి. ఈ దెబ్బ‌తో ప‌సిడి మ‌రింత మెరిసింది. ఇలాంటి సంక్షోభ స‌మ‌యంలో ఇన్వెస్ట‌ర్లను ఆదుకోవ‌డం బంగారానికి అల‌వాటు. 2020లోనూ అదే జ‌రిగింది. బంగారం ఏకంగా రూ.57 వేల మార్క్‌ను కూడా తాకింది. కానీ అదే స‌మ‌యంలో బిట్‌కాయిన్ సృష్టిస్తున్న‌ ప్ర‌కంప‌న‌ల‌ను మాత్రం చాలా మంది గుర్తించ‌లేక‌పోయారు. క‌రోనా మ‌హ‌మ్మారి బంగారం కంటే ఎక్కువ‌గా బిట్‌కాయిన్‌కే క‌లిసివ‌చ్చింది. క‌రోనా కాలంలో సాంప్ర‌దాయ పెట్టుబ‌డులు, ఆస్తుల‌కు పెద్ద దెబ్బే ప‌డింది. ఇలాంటి స‌మ‌యంలో ఇన్వెస్ట‌ర్ల‌కు బిట్‌కాయిన్ క‌నిపించింది. ఇదే ఈ క్రిప్టోకరెన్సీ మ‌ళ్లీ దూసుకుపోవ‌డానికి కార‌ణ‌మైంది. అప్ప‌టి వ‌ర‌కూ బిట్‌కాయిన్ ఉనికిని గుర్తించ‌ని వాళ్లు, దీనిపై చెడు అభిప్రాయం ఉన్న వాళ్లు కూడా ఇందులో పెట్టుబ‌డి పెట్ట‌డానికి మొగ్గు చూపారు. పెద్ద పెద్ద కంపెనీలు భారీ పెట్టుబ‌డులు పెట్ట‌డంతో బిట్‌కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది. సాంప్ర‌దాయ పెట్టుబ‌డి మార్గాలైన ఈక్విటీలు, గోల్డ్‌, న‌గ‌దుకు ఈ డిజిట‌ల్ క‌రెన్సీ ప్ర‌త్యామ్నాయంగా మారిపోయింద‌ని క్రిప్టోక‌రెన్సీ నిపుణులు చెబుతున్నారు. అస్థిర‌త లేక‌పోతే క‌నుక భ‌విష్య‌త్తులో బిట్‌కాయిన్ విలువ మ‌రింత భారీగా పెరగ‌నుంద‌ని గ్లోబ‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ చేజ్ అంచ‌నా వేసింది. 

ప‌రిమితంగా ఉండ‌టం కూడా..

క‌రోనా కాలంలో చాలా మంది బంగారం, బిట్‌కాయిన్‌లాంటి సుర‌క్షిత పెట్టుబడి మార్గాల‌ను ఎంచుకున్నారు. చివ‌రికి ఈ ఇద్ద‌రూ లాభ‌పడినా.. బంగారం కంటే బిట్‌కాయిన్‌ను న‌మ్ముకున్న వాళ్లు ఊహించ‌ని స్థాయిలో లాభాలు ఆర్జించారు. ఇన్నాళ్లూ బంగారాన్నే న‌మ్ముకున్న గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్లు కూడా మెల్ల‌గా బిట్‌కాయిన్ వైపు అడుగులు వేసే ప‌రిస్థితి త‌లెత్తింది. ఇక బిట్‌కాయిన్ ప‌రిమిత సంఖ్య‌లో అందుబాటులో ఉండ‌టం కూడా దాని విలువ పెర‌గ‌డానికి మ‌రో కార‌ణమైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌రిష్ఠంగా 2.1 కోట్ల బిట్‌కాయిన్లు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి. అందులో ఇప్ప‌టికే 1.8 కోట్లు మార్కెట్‌లో చెలామ‌ణి అవుతున్నాయి. 

ఈ బుడ‌గ మ‌ళ్లీ పేలిపోతుందా?

క్ర‌మంగా ఇన్వెస్ట‌ర్లు చూపు ఈ బిట్‌కాయిన్ వైపు మ‌ర‌లుతున్నా.. ఇప్ప‌టికీ ఇది మ‌రోసారి పేలిపోయే బుడ‌గేనా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. 2017లోనూ ఇలాగే ఎవ‌రి ఊహ‌కూ అంద‌ని స్థాయిలో దూసుకుపోయిన బిట్‌కాయిన్‌.. ఆ త‌ర్వాతి ఏడాది ఒకేసారి 65 శాతం ప‌త‌నం కావ‌డం ఇన్వెస్ట‌ర్ల‌లో ఈ ఆందోళ‌న‌కు ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. అంతెందుకు సోమ‌వారం కూడా ఒకే రోజు 4 వేల డాల‌ర్లు ప‌త‌న‌మైంది ఈ క్రిప్టోక‌రెన్సీ. బిట్‌కాయిన్ ఎంత అస్థిర‌మైన‌దో ఈ ఘ‌ట‌న‌లు నిరూపిస్తున్నాయి. అందుకే ఇప్ప‌టికీ చాలా మంది ఇన్వెస్ట‌ర్లు బిట్‌కాయిన్‌పై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 


ఇవి కూడా చ‌ద‌వండి

అద‌ర్ పూనావాలా భార్య ఎవ‌రు? ఆయ‌న మ‌తం ఏంటి?

ఇండియ‌న్ క్రికెట‌ర్‌తో మాట్లాడిన ఆ న‌ర్స్ ఎవ‌రు?

ఆ డీల్ ఆప‌క‌పోయారో.. ఇండియాకు అమెరికా వార్నింగ్‌

కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌..

కేఎల్ రాహుల్‌కు గాయం.. ఆసీస్ నుంచి వెన‌క్కి

VIDEOS

logo