గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 28, 2020 , 00:18:51

వదంతులు నమ్మొద్దు

వదంతులు నమ్మొద్దు
  • చికెన్‌, గుడ్లు తింటే కరోనా వైరస్‌ వ్యాపించదు: పౌల్ట్రీ పరిశ్రమ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చికెన్‌, గుడ్లు తింటే కరోనా వైరస్‌ ఏమీ రాదని, అలాంటి వదంతులు నమ్మవద్దని వినియోగదారులకు పౌల్ట్రీ పరిశ్రమ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్‌ ప్లాజాలో ‘చికెన్‌, ఎగ్‌మేళా’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వి శ్రీనివాస్‌ గౌడ్‌,  ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వి లక్ష్మారెడ్డి, నటి రష్మిక తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. నగరంలోని ఎర్రమంజల్‌ ఎన్‌కేఎం హోటల్‌లో ఆల్‌ ఇండియా పౌల్ట్రీ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, తెలంగాణ పౌల్ట్రీ సమాఖ్య, నెక్‌, పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డి రాంరెడ్డి, కేజీ ఆనంద్‌, డాక్టర్‌ హర్షవవర్ధన్‌ తదితరులు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వదంతులు నమ్మవద్దని, చికెన్‌, గుడ్లను నిర్భయంగా తినవచ్చన్నారు. 


నేడు చికెన్‌,ఎగ్‌ మేళా

కరోనా (కోవిడ్‌-19) వైరస్‌కు చికెన్‌, గుడ్లకు ఏ విధమైన సంబంధం లేదని, ఎంతో సురక్షితమైన, బలవర్ధకమైన, మెరుగైన ఆహారమని డాక్టర్లు, పౌల్ట్రీ శాస్త్రవేత్తలు, పౌష్టికాహార నిపుణులు ధృవీకరించినట్లు గుర్తుచేశారు. ఇక ఇటీవల ఖమ్మం, వరంగల్‌లో కోళ్లు చనిపోవడానికి వాతావరణ మార్పులే కారణమని,సహజంగా చలికాలం ముగిసి ఒకేసారి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఇలా జరుగడం మామూలేనని చెప్పారు. చికెన్‌, ఎగ్‌ మేళాకు తరలివచ్చే సందర్శకులకు ఉచితంగా స్నాక్స్‌ పంపిణీ చేయడం ద్వారా చికెన్‌, గుడ్డు తినడం వల్ల ఎలాంటి  ప్రమాదం ఉండదని భరోసా కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య లక్ష్యమని పౌల్ట్రీ ప్రతినిధులు స్పష్టం చేశారు. 10 నుంచి 12 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా వేసి 6 టన్నుల చికెన్‌, గుడ్లు సిద్ధం చేశామని చెప్పారు. కాగా, కరోనా భయాల నేపథ్యంలో తెలంగాణలో గత నెల రూ.300 కోట్ల అమ్మకాలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.400 కోట్ల అమ్మకాలు పడిపోయాయి.


చికెన్‌ విక్రయాలు ఢమాల్‌

కరోనా వైరస్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా గడిచిన నెల రోజుల్లో చికెన్‌ విక్రయాలు 50 శాతం మేర పడిపోయాయి. అలాగే ధరలు 70 శాతం దిగజారినట్లు గోద్రేజ్‌ అగ్రోవెల్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చికెన్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియా వదంతులు రావడంతో డిమాండ్‌ పడిపోవడంతోపాటు ధరలు భారీగా తగ్గాయన్నారు. ఈ పుకార్లతో వచ్చే రెండు నుంచి మూడు నెలల వరకు చికెన్‌, కోడిగుడ్ల వినిమయం మరింత పడిపోనున్నదన్న ఆయన..దేశీయంగా కొరత ఏర్పడితే మాత్రం వీటి ధరలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. గతంలో దేశవ్యాప్తంగా 75 మిలియన్ల బర్డ్స్‌ అమ్ముడవుతుండగా, ప్రస్తుతం 35 మిలియన్లకు పడిపోగా, ఫామ్‌ గేట్‌ వద్ద ధర రూ.100 నుంచి 70 శాతం తగ్గి రూ.35కి పరిమితమయ్యాయి. వాట్సప్‌లో వచ్చిన పుకార్లతో ఇండస్ట్రీతోపాటు రైతులపై ప్రభావం పడనున్నది.
logo