శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Feb 02, 2020 , 07:56:52

వేతన జీవులకు ఊరట ఉత్తిదే!?

 వేతన జీవులకు ఊరట ఉత్తిదే!?

ఆదాయం పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్ర బడ్జెట్‌లో తీసుకొచ్చిన కొత్త విధానంతో మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించడం ఒట్టిమాటేనని తేలిపోయింది.

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  ఆదాయం పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్ర బడ్జెట్‌లో తీసుకొచ్చిన కొత్త విధానంతో మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించడం ఒట్టిమాటేనని తేలిపోయింది. పన్ను శ్లాబుల్లో కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ ఇదివరకే పొందుతున్న రాయితీలను వదులుకున్నవారికి మాత్రమే ప్రయోజనాన్ని చేకూరుస్తామని కేంద్ర ప్రభుత్వ ప్రకటించడంతో మధ్యతరగతి జనులకు, ముఖ్యంగా రూ.8.50 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వేతనజీవులకు ఒరిగేదీమీ ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎందుకంటే, తరతరాల నుంచి సంప్రదాయ రీతిలో పొదుపు, మదుపులకు అలవాటుపడినవారి సంఖ్యే అధికం. ఆదాయం పన్ను మినహాయింపు లభిస్తుందన్న ఆశతో గృహాలను కొనుగోలుచేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పొదుపు పథకాలను ఆశ్రయించనివారికి కొత్త విధానంలో కొంత ఊరట లభించే అవకాశమున్నదని వ్యాఖ్యానించే నిపుణులు లేకపోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వేతనజీవులు ఆదాయం పన్ను చెల్లింపులకు కొత్త విధానాన్ని ఎంచుకొంటే కలిగే ప్రయోజనమేమిటి? ఏయే శ్లాబుల్లో ఉన్నవారి జేబులకు ఎంత చిల్లు పడుతుందన్న వివరాలను పట్టికలో చూడొచ్చు. 

ఈ పట్టికను క్షుణ్ణంగా గమనిస్తే.. రూ.5 లక్షల్లోపు ఆదాయం గల వేతనజీవులు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరంలేదు. రూ.6 నుంచి 7 లక్షల్లోపు వార్షికాదాయమున్నవారు కూడా ప్రస్తుత విధానంలో పన్ను చెల్లించనక్కర్లేదు. సెక్షన్‌ 80సీ కింద పన్ను రాయితీలు, సెక్షన్‌ 80డి కింద తగ్గింపులు ఉండటమే ఇందుకు కారణం. కొత్త విధానంలో అయితే.. వార్షికంగా రూ.6 లక్షల ఆదాయాన్ని ఆర్జించేవారికి రాయితీలు, మినహాయింపులు ఉండవు కాబట్టి రూ.22,500 వరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఏడాదికి రూ.7 లక్షలు ఆర్జించేవారికి రూ.32,500 భారం పడుతుంది. రూ.7.5 లక్షల వార్షికాదాయమున్నవారు పాత విధానంలో రూ.17,500 పన్ను కట్టాల్సివస్తే.. కొత్త విధానంలో రూ.37,500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే కొత్త విధానంతో వేతనజీవులపై భారం పడటమే తప్ప ప్రయోజనమేమీ ఉండదని స్పష్టమవుతున్నది.
logo