గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 30, 2021 , 20:07:02

పీవీ చలవతోనే మన్మోహన్‌ సంచలనాలు: భారత్‌ సంస్క‘రణం’!

పీవీ చలవతోనే మన్మోహన్‌ సంచలనాలు: భారత్‌ సంస్క‘రణం’!

న్యూఢిల్లీ‌: ఆర్థికంగా దేశం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న టైంలో తెలుగు తేజం పీవీ నర్సింహారావు సారథ్యంలో 1991 జూన్ నెలలో కాంగ్రెస్ సర్కార్ కేంద్రం కొలువు దీరినా.. నాడు చెల్లింపులకు బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. అయితే, స్ఫూరద్రుపి పీవీ నర్సింహారావు తన క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా రాజకీయ నాయకుడ్ని కాక పేరొందిన ఆర్థిక వేత్తను నియమించుకోవాలన్న నిర్ణయం తీసుకోవడం వల్లే ఈనాడు భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయంగా గణనీయ పురోగతి సాధించడంతోపాటు సంప‌న్న దేశాల స‌ర‌స‌న నిలిచేందుకు వ‌డివ‌డిగా ప‌రుగులు తీస్తోంది. 


సామ్య‌వాదం ప్ల‌స్‌ లైసెన్స్ రాజ్‌.. అనిశ్చితి

నాడు 1991లో పీవీ నర్సింహారావు క్యాబినెట్‌లో డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ సామ్యవాద అజెండాతోనే ముందుకు సాగుతున్న త‌రుణం. మన ఆర్థిక వ్యవస్థలో అప్పులు స్థూల జాతీయోత్పత్తిలో 23శాతానికి చేరాయి. లైసెన్స్‌ రాజ్‌ వ్యవస్థ రాజ్యమేలుతూ ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌ధాన‌ అడ్డంకిగా మారింది.దీంతో పాటు పారిశ్రామిక రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కోవడంతో నిరుద్యోగం విలయ తాండవం చేసింది. రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణాలు వరుసగా 13, 17 శాతానికి చేరి కొండెక్కి కూర్చున్నాయి. విదేశీ మారక నిల్వలు రూ.2500 కోట్లతో అత్యంత కనిష్ఠ స్థాయికి చేరాయి. మరోవైపు రాజకీయ అస్థిరత నిప్పుకు ఉప్పులా తోడయి, ఇలా దేశం పూర్తిగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. 


తొలి బ‌డ్జెట్‌లోనే సంస్క‌ర‌ణ‌ల ‘మన్మోహనం’

సరిగ్గా ఈ తరుణంలోనే ఒక‌వైపు ప్ర‌ధానిగా పీవీ న‌ర్సింహారావు అందించిన ప్రోత్సాహం.. మ‌రోవైపు ఆర్థిక విధానాలపై అపార జ్ఞానం, అనుభవంతో మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. మ‌న్మోహ‌నుడు త‌న తొలి 1991-92 బడ్జెట్‌లోనే భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఓ రకంగా చెప్పాలంటే బడ్జెట్‌ ప్రవేశపెడుతూ నాడు మన్మోహన్‌ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రసంగం దేశ గతినే మార్చేసింది. 


విదేశీ పెట్టుబ‌డుల‌కు అధిక ప్రాధాన్యం

ఎంపిక చేసిన పరిశ్రమల్లో విదేశీ యాజమాన్యానికి మెజారిటీ వాటాకు అనుమతిస్తూ మ‌న్మోహ‌న్ సింగ్ మార్పులు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 20శాతం పెట్టుబడుల్ని ఉపసంహరించుకుని, వాటి స్థానంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. ఎరువులు, వంట గ్యాస్‌, పెట్రోల్‌ ధరల్ని పెంచారు. చక్కెరపై కల్పించిన రాయితీని ఎత్తివేశారు. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ పన్ను రాయితీలు ప్రకటించారు. మూలం వద్దే పన్ను వసూలు(టీడీఎస్‌) విధానానికి శ్రీకారం చుట్టారు. విదేశీ నిధులపై వచ్చే డివిడెండ్లపై విధించే పన్నునూ భారీగా తగ్గించారు.భారీగా కార్పొరేట్ ప‌న్ను వ‌డ్డ‌న‌

కార్పొరేట్‌ పన్నును 40శాతం నుంచి 45శాతానికి పెంచారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. మ్యూచువల్‌ ఫండ్లలోకి ప్రైవేటు రంగ పెట్టుబడులను అనుమతించారు. ఈ నిర్ణయాలతో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి తీసుకున్న రుణ చెల్లింపుపై ఆ సంస్థకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.


సెబీకి పూర్తిగా స్టాక్ మార్కెట్ల నియంత్ర‌ణాధికారాలు

వీటితోపాటు స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిర్వహణపై చట్టబద్ధ అధికారాల్ని పూర్తిగా సెబీకి బదలాయించారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్‌ 80హెచ్‌హెచ్‌సీ కింద ఇచ్చే పన్ను రాయితీని పెంచారు. దీంతో సాఫ్ట్‌వేర్‌ రంగం ఆర్థికంగా నిలదొక్కుకొని దేశంలో సమాచార సాంకేతిక విప్లవానికి ఓ కారణమైంది.


సంచ‌ల‌నాల‌తో ఎకాన‌మీలో స‌మూల మార్పులు

ఇలా ప‌లు సంచలనాత్మక నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థని మన్మోహన్‌ సమూలంగా మార్చారు. విదేశీ పెట్టుబడులకు, కంపెనీలకు తలుపులు తెరిచి పారిశ్రామిక, సేవల రంగానికి ఊతం కల్పించారు. దీంతో ఉద్యోగాలు పెరిగి క్షేత్ర స్థాయిలో ప్రజల ఆర్థిక మూలాలు బలపడ్డాయి. దీనికి దన్నుగా సమాచార సాంకేతిక రంగం ఫలాలు అందడంతో దేశ ఆర్థికి పరిస్థితి తిరిగి గాడిన పడింది. ఇలా పలు ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ను నిలిపిన ఘనత మన్మోహన్‌ది.