శనివారం 30 మే 2020
Business - Apr 14, 2020 , 00:17:40

జీడీపీ-6.1%!

జీడీపీ-6.1%!

  • ఏప్రిల్‌-జూన్‌పై నోమురా అంచనా 

ముంబై, ఏప్రిల్‌ 13: కరోనా రక్కసి భారత ఆర్థిక వ్వవస్థను చిన్నాభిన్నం చేస్తున్నది. ఇప్పటికే ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నరేంద్ర మోదీ సర్కార్‌కు కరోనా వైరస్‌ రూపంలో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇదివరకే పలు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు దేశ వృద్ధిరేటును 1 నుంచి 2 శాతం లోపు అంచనా వేయగా..తాజాగా జపాన్‌కు చెందిన బ్రోకరేజ్‌ సంస్థ నోమురా ఏకంగా ప్రతికూలానికి పడిపోనున్నదని హెచ్చరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యకాలం)లో భారత వృద్ధిరేటు - 6.1 శాతానికి జారుకోనున్నదని తెలిపింది. మరోవైపు పడిపోతున్న వృద్ధిని అట్టుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం, అటు రిజర్వుబ్యాంకులు కీలక చర్యలు తీసుకుంటున్నాయని, ఈ ఏడాదిలో వడ్డీరేట్లు మరో 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను 3.2 శాతం వృద్ధిని సాధించనున్నదని అంచనావేస్తున్న నోమురా..అదే జూన్‌ నాటికి -6.1 శాతానికి పడిపోనున్నదని తెలిపింది. కానీ, సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి  0.5 శాతం, అలాగే చివరి త్రైమాసికం నాటికి 1.4 శాతం వృద్ధిని సాధించనున్నదని వెల్లడించింది. 

వృద్ధి పురోగతికి ఏమైనా చేస్తాం: ఆర్బీఐ

దేశ వృద్ధిరేటు పురోగతి కోసం ఎంతటి నిర్ణయమైనా తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను అదృశ్య హంతకిగా అభివర్ణించిన ఆయన దీన్ని త్వరగా అంతమొందించాలని, లేకుంటే భారీ స్థాయిలో ప్రాణ, ఆర్థిక నష్టాలు తప్పవని హెచ్చరించారు. ఆర్బీఐ ఇటీవలి ద్రవ్య సమీక్షలో దాస్‌ మాటల ప్రకారం ఈ మహమ్మారి ధాటికి దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది.


logo