సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 19, 2020 , 02:12:17

‘హెచ్‌డీఎఫ్‌సీ’ అంతంతే

‘హెచ్‌డీఎఫ్‌సీ’ అంతంతే

  • క్యూ1లో రూ. 6,659 కోట్ల లాభం

హైదరాబాద్‌, జూలై 18: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంకైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో వృద్ధిని నమోదు చేసుకోలేకపోయాయి. కరోనా వైరస్‌తో దేశ ఆర్థిక రంగం కుదేలవడంతో గడిచిన త్రైమాసికానికిగాను బ్యాంక్‌ రూ.6,659 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం నమోదైన రూ.5,568.16 కోట్ల లాభంతో పోలిస్తే 20 శాతం పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో పనితీరు కనబరుచలేకపోయింది.  వడ్డీ ఆదాయం పెరుగడం వల్లనే ఈ మాత్రమైన లాభాలు వచ్చినట్లు బ్యాంక్‌ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో ఆదాయం రూ.32,361.84 కోట్ల నుంచి రూ.34,453.28 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. జూన్‌ 30తో ముగిసిన మూడు నెలల్లో నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17.8 శాతం పెరిగి రూ.15,665.40 కోట్లకు చేరుకున్నది. ఏడాది క్రితం ఇది రూ.13,294.30 కోట్లుగా ఉన్నది. అడ్వాన్స్‌లు 20.9 శాతం పెరుగగా, అదే డిపాజిట్లలో వృద్ధి 24.6 శాతంగా నమోదైనట్లు ముంబై కేంద్రస్థానంగా ఆర్థిక సేవలు అందిస్తున్న బ్యాంక్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆర్థిక మందగమన పరిస్థితుల వల్ల రిటైల్‌ రుణాల్లో వృద్ధి మందగించగా.. థర్డ్‌ పార్టీ ఉత్పత్తులు కూడా, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వినిమయం పడిపోయిందని, అలాగే కొన్ని ఫీజులను మాఫీ చేస్తున్న బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక ఫలితాలై ప్రభావం చూపిందని పేర్కొంది.  

ఆర్థిక ఫలితాల్లో ముఖ్యాంశాలు..

  • నికర వడ్డీ మార్జిన్‌లో 4.3 శాతం వృద్ధి కనబరిచింది.
  • lస్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.40 శాతం( రూ.11,768.95 కోట్ల) నుంచి 1.30 శాతానికి (రూ.13,773.46 కోట్ల)తగ్గింది. 
  • నికర ఎన్‌పీఏ కూడా 0.43 శాతం (రూ.3,567.18 కోట్ల) నుంచి 0.33 శాతానికి(రూ.3,279.96 కోట్లు) పరిమితమైంది. 
  • మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్‌ రూ.3,891.52 కోట్ల నిధులను వెచ్చించింది. 
  • డిపాజిట్లు 24.6 శాతం పెరిగి రూ.11.89 లక్షల కోట్లకు చేరుకోగా, అడ్వాన్స్‌లు కూడా 20.9 శాతం అధికమై రూ.10.03 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 
  •  సమీకృత విషయానికి వస్తే రూ.36,698.59 కోట్ల ఆదాయంపై రూ.6,927.24 కోట్ల నికర లాభాన్ని గడించింది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసులను  కలుపుకొని ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. హెచ్‌ఎస్‌ఎల్‌లో 96.5 శాతం, హెచ్‌డీబీఎఫ్‌ఎస్‌ఎల్‌లో 95.3 శాతం వాటా ఉన్నది. 


logo