బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Feb 28, 2020 , 00:47:02

భారత్‌కు కరోనా దెబ్బ

భారత్‌కు కరోనా దెబ్బ
  • వైరస్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కష్టం: డీఅండ్‌బీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: నిన్న మూడీస్‌.. నేడు డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌. భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావంపట్ల వరుస హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్థిక మందగమనంలో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న భారత్‌కు.. కరోనా వైరస్‌తో మరిన్ని కష్టాలేనని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ (డీఅండ్‌బీ) గురువారం అభిప్రాయపడింది. కరోనా కారణంగా చైనా నుంచి ముడి సరుకు, విడి భాగాల సరఫరాల్లో అంతరాయం, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఏర్పడవచ్చని తమ ఆర్థిక సలహాదారు నివేదికలో అంచనా వేసింది. ఈ ప్రాణాంతక వైరస్‌ అదుపులోకి రాకపోతే దేశీయ ఉత్పాదక రంగమే కుంటుపడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ‘కరోనా వైరస్‌ వ్యాప్తి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాపార-వాణిజ్య పరిస్థితులు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బ తింటున్నది. భారతీయ సంస్థలను ఈ పరిణామం తీవ్రంగానే ప్రభావితం చేయవచ్చు’ అని డీఅండ్‌బీ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త అరుణ్‌ సింగ్‌ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. ఈ సమయంలో కరోనా వైరస్‌ విజృంభణ.. భారత ఎకానమీకి ఇబ్బందేనని వ్యాఖ్యానించారు. 


కరోనా వైరస్‌.. మహమ్మారిగా ముదిరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కష్టాలేనని మూడీస్‌ బుధవారం హెచ్చరించిన విషయం తెలిసిందే. భారత్‌పైనా దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేసింది. గత నెల 30న కరోనా వైరస్‌ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇప్పటిదాకా చైనాలో ఈ వైరస్‌ బాధిత మరణాల సంఖ్య 2,744గా ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య దాదాపు 78,500లకు పెరుగగా, మళ్లీ ఈ వైరస్‌ విజృంభిస్తున్నదని చైనా చెబుతుండటం ప్రపంచాన్నే కలవరపెడుతున్నది. కరోనా దెబ్బకు మొబైల్‌, టెలివిజన్‌, ఆటో రంగాలకు చైనా నుంచి ముడి సరుకు సరఫరా నిలిచిపోగా, దేశీయ కంపెనీలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా పరిశ్రమలన్నీ మూతబడటంతో ఉత్పత్తి దాదాపుగా నిలిచిపోయింది. కాగా, ఈ జనవరిలోనూ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 0.1-0.5 శాతంగానే ఉండొచ్చని ఈ సందర్భంగా డీఅండ్‌బీ అంచనా. డిసెంబర్‌ ఐఐపీ -0.3 శాతంగా నమోదైనది తెలిసిందే.


రూ.18 లక్షల కోట్ల నష్టం

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ జీడీపీకి దాదాపు రూ.18 లక్షల కోట్ల నష్టం వాటిల్లవచ్చని పరిశ్రమ సంఘం పీహెచ్‌డీసీసీఐ అంచనా వేసింది. సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయం.. కేవలం చైనా ఎగుమతుల్నేగాక, దిగుమతి దేశాల ప్రయోజనాలనూ దెబ్బతీస్తున్నదని పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు డీకే అగర్వాల్‌ అన్నారు. దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యం పెరుగాలని, ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభావితం కాకుండా ఉండవచ్చని పరిశ్రమకు సూచించారు.


4 శాతం తగ్గిన ఇంధన ధరలు

ఇంధన ధరలు క్రమంగా శాంతిస్తున్నాయి. కరోనా వైరస్‌ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు గురువారం నాలుగు శాతం మేర తగ్గాయి. ఈ వైరస్‌ మరిన్ని దేశాలకు పాకుతున్నట్లు వచ్చిన భయాలతో గ్లోబల్‌ మార్కెట్లో క్రూడాయిల్‌కు డిమాండ్‌ పడిపోయింది. ఏప్రిల్‌ నెల డెలివరీకిగాను బ్యారెల్‌ ఇంధన ధర 4.2 శాతం తగ్గి 51.20 డాలర్ల వద్ద నిలిచింది. వరుసగా ఐదు రోజులుగా తగ్గుముఖం పట్టడంతో క్రూడ్‌ ధర 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ వైరస్‌తో చైనాలో మరణించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, మరోవైపు దక్షిణ కొరియా, ఇటలీ. ఇరాన్‌, కెనడా, అమెరికాకు కూడా పాకుతుండటం కూడా గ్లోబల్‌ మార్కెట్లపై భయాలు చుట్టుముట్టాయి. 


ఇలాగే ఉంటే ఇబ్బందే

దేశ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమపై కరోనా వైరస్‌ ప్రభావం ఇప్పటికైతే లేదు. మరో రెండు నెలలు పరిస్థితులు మెరుగుపడకపోతే మాత్రం ఇబ్బందే. ముడి సరుకు కొరతకు వీలుండొచ్చు. పరిశ్రమ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. త్వరలోనే అంతా సర్దుకోవచ్చు. నేనిప్పటి వరకు 20-23 మంది పారిశ్రామిక వేత్తలను కలిసి కరోనా ప్రభావంపై ఆరా తీశాను. వారిలో నాకెలాంటి ఆందోళన కనిపించలేదు.

- నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి


ఐదోరోజు అదే తీరు..

సెన్సెక్స్‌ 143,నిఫ్టీ 45 పాయింట్ల పతనం

కరోనా భయాలు స్టాక్‌ మార్కెట్లను వీడటం లేదు. వరుసగా ఐదోరోజు దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుదేలయ్యాయి. బ్యాంకింగ్‌, ఐటీ, ఇంధన రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికాగా, అలాగే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చి న ప్రతికూల సంకేతాలు మదుపరుల్లో ఆందోళనను మరింత పెంచింది. ఫలితంగా నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఒక దశలో 500 పాయింట్ల వరకు కోల్పోయాయి. చివరకు 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ 143.30 పాయింట్లు పతనం చెంది 39,745.66 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ కూడా 45.20 పాయింట్లు పడిపోయి 11,633.30 వద్ద స్థిరపడింది. వరుసగా ఐదు రోజుల్లో సెన్సెక్స్‌ 1,577.34 పాయిం ట్లు, నిఫ్టీ 492.60 పాయింట్లు పతనం చెందాయి. ఓఎన్‌జీసీ 2.61 శాతం పడిపోయి టాప్‌ లూజర్‌గా నిలిచింది. 


మహీం ద్రా అండ్‌ మహీంద్రా, ఎస్బీఐ, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఫిన్‌ షేర్లు ఒక్క శాతానికి పైగా పడిపోయాయి. వీటితోపాటు టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, అల్ట్రాసిమెంట్‌, ఐటీసీ, రిలయన్స్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల షేర్లు మదుపరులను ఆకట్టుకోలేక పోయాయి. కానీ, సన్‌ఫార్మా 3.68 శాతం ఎగబాకి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టైటాన్‌, కొటక్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతి, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌లు లాభపడ్డాయి.
logo
>>>>>>