గురువారం 26 నవంబర్ 2020
Business - Oct 01, 2020 , 02:28:25

2018-19 ఐటీ రిటర్నుల దాఖలుకు నవంబర్‌ 30 వరకు గడువు

2018-19 ఐటీ రిటర్నుల దాఖలుకు నవంబర్‌ 30 వరకు గడువు

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను (ఐటీ) విభాగం మరింత ఊరట కల్పించింది. 2018-19 మదింపు సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును మరో రెండు నెలలు (నవంబర్‌ 30 వరకు) పొడిగించింది. కొవిడ్‌-19 సంక్షోభంతో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న వాస్తవిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ చర్య చేపట్టినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బుధవారం వెల్లడించింది. 2019-20 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆలస్యంగా దాఖలుచేసే రిటర్నులతోపాటు సవరించిన రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్‌ 30 నుంచి నవంబర్‌ 30 వరకు పొడిగించినట్టు తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒరిజినల్‌, సవరించిన ఐటీఆర్‌ల దాఖలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం గడువును పొడిగించడం ఇది నాలుగోసారి. గతంలో ఈ గడువును మార్చి 31 నుంచి జూన్‌ 30కి, అనంతరం జూలై 31కి, ఆ తర్వాత సెప్టెంబర్‌ 30కి పొడిగించిన విషయం తెలిసిందే.