e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home బిజినెస్ మేము సైతం

మేము సైతం

  • వైరస్‌పై పోరులో జాతికి కార్పొరేట్ల అండ
  • దేశంలో ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు,
  • మెరుగైన వైద్య సదుపాయాలకు చేయూత
  • కోల్‌ ఇండియా, ఎన్‌ఎఫ్‌ఎల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు

కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు మేమున్నామంటూ కార్పొరేట్లు తమ వంతు చేయూతనందిస్తున్నారు. గతేడాది ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రుల సహాయ నిధిలకు వందల కోట్ల రూపాయల్లో విరాళాలిచ్చిన కంపెనీలు.. ఈ ఏడాదీ పెద్ద మనసును చాటుకుంటున్నాయి. ఆక్సిజన్‌ కొరతను తీర్చేలా కొన్ని సంస్థలు సాయం చేస్తుంటే.. మరికొన్ని తాత్కాలిక దవాఖానల నిర్మాణానికి, రోగులకు కావాల్సిన పడకల ఏర్పాటుకు అండగా నిలుస్తున్నాయి. ఇంకొన్ని వ్యాక్సినేషన్‌ కోసం కోట్లాది రూపాయలను ఇస్తున్నాయి.

మేము సైతం

న్యూఢిల్లీ/ముంబై, ఏప్రిల్‌ 27: ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్‌ ఇండియా లిమిటెడ్‌.. తమ అనుబంధంగా పనిచేస్తున్న మూడు సంస్థలు ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు యోచిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే దాదాపు 2వేల పడకలతో ఓ తాత్కాలిక దవాఖానను కోల్‌ ఇండియా నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇందులో ఐసీయూలూ ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) సైతం ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ల్లోని సర్కారీ దవాఖానల్లో నాలుగు ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ప్రతీది రోజూ 70 సిలిండర్లకు సమానమైన ప్రాణవాయువును ఉత్పత్తి చేయనున్నది.

అదానీ పోర్టుల్లో చార్జీల్లేవ్‌
కరోనా సంబంధిత పరికరాలను రవాణా చేసే నౌకలకు చార్జీలను రద్దు చేస్తున్నట్లు అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ (ఏపీసెజ్‌) ప్రకటించింది. ఇప్పటికే అదానీ గ్రూప్‌ యూఏఈ, థాయిలాండ్‌, సౌదీ అరేబియాల నుంచి మెడికల్‌ ఆక్సిజన్‌ రవాణా కోసం సుమారు 24 క్రయోజనిక్‌ ట్యాంకులను అందించింది. ఈ క్రమంలో కొవిడ్‌ సంబంధిత కార్గో రవాణాపై ఎలాంటి భారం మోపదల్చుకోలేదన్నది.

వ్యాక్సినేషన్‌కు పీఅండ్‌జీ బాసట
ఎఫ్‌ఎంసీజీ సంస్థ ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ (పీఅండ్‌జీ).. దేశంలోని 5 లక్షలకుపైగా జనాభాకు కరోనా వ్యాక్సిన్లు అందేలా రూ.50 కోట్లను విరాళంగా ప్రకటించింది. ప్రభుత్వాలు, స్థానిక అధికారుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతామని సంస్థ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా తమకున్న 5వేల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకూ వ్యాక్సినేషన్‌ చేయిస్తున్నట్లు పేర్కొన్నది.

షీలా ఫోం 500 బెడ్లు
స్లీప్‌వెల్‌ బ్రాండ్‌తో పరుపుల్ని తయారుచేస్తున్న షీలా ఫోం సంస్థ.. ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు 500 పడకలను విరాళంగా అందించింది. ఆక్సిజన్‌ అవసరం ఉన్న రోగులకు వీలుగా ఈ బెడ్లుంటాయని తెలిపింది. గతేడాది 10వేల పడకలను సంస్థ విరాళంగా ఇవ్వడం గమనార్హం.

ప్రాణాలే ముఖ్యం: జిందాల్‌
ఉక్కు ఉత్పత్తి కంటే ప్రాణాలను కాపాడటమే ముఖ్యమని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ అన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు ద్రవరూప మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరాకే జేఎస్‌డబ్ల్యూ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు చైనా స్మార్ట్‌ఫోన్‌ సంస్థలు ఒప్పో, వివో కూడా కొవిడ్‌-19 సహాయక చర్యల్లో భాగస్వాములవుతున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మేము సైతం

ట్రెండింగ్‌

Advertisement