శనివారం 06 జూన్ 2020
Business - Apr 20, 2020 , 18:47:21

బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో హ‌ఠాన్మ‌ర‌ణం

బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో హ‌ఠాన్మ‌ర‌ణం

న్యూఢిల్లీ: జ‌ర్మ‌నీకి చెందిన  ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత సీఈవో రుద్రతేజ్ సింగ్ మరణించారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇవాళ‌ ఉదయం కన్నుమూశారు. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ సంస్థ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆయ‌న్ను ఇక్కడ సీఈవోగా నియమించారు. 2019 ఆగస్టు1న రుద్రతేజ్ సింగ్ సీఈవోగా నియమితులయ్యారు. ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ  యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. భారతదేశం అంతటా డీలర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలను అమలు చేస్తున్న సమయంలో ఆయన మరణం తమకు తీరని లోటని సంస్థ తెలిపింది.ఈ కష్ట కాలంలో కుటుంబంతోపాటు సన్నిహితులకు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చింది. 

1996లో యూపీలో చిన్న ఏరియా సేల్స్ మేనేజర్‌గా జీవితం ప్రారంభించిన రుద్ర తేజ్ సింగ్ క్రమంగా ఎదుగుతూ విజయ పథాన్ని నిర్మించుకున్నారు. హిందూస్తాన్ యూనిలివర్ కంపెనీకి భారత్‌లో, అంతర్జాతీయ మార్కెట్లలోనూ 16ఏళ్ల పాటు సుదీర్ఘంగా సేవలు అందించారు. చివరగా రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్లోబల్ ప్రెసిడెంట్‌గా విశేషంగా రాణించారు. గత 8నెలలుగా బీఎండబ్ల్యూ భారత ప్రెసిడెంట్‌గా, సీఈవోగా రుద్రతేజ్ సింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల వ్యాపార ప్రముఖులుల సంతాపం ప్రకటిస్తున్నారు.


logo