శనివారం 08 ఆగస్టు 2020
Business - Aug 02, 2020 , 00:08:31

పీఎస్‌యూలకు సరికొత్త విధానం

పీఎస్‌యూలకు సరికొత్త విధానం

న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశంలోని వ్యూహాత్మక రంగాలను నిర్వచిస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లకు సంబంధించి సరికొత్త విధానాన్ని తీసుకురానున్నది. మున్ముందు ఒక్కో కీలక రంగంలో గరిష్ఠంగా నాలుగు ప్రభుత్వ రంగ కంపెనీలు మాత్రమే ఉంటాయని, ఇతర సెగ్మెంట్లలోని ప్రభుత్వాధీన సంస్థలను క్రమంగా ప్రైవేటీకరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రస్తుతం దీనిపై కసరత్తు జరుగుతున్నదని, త్వరలో ఈ అంశం మంత్రివర్గం ముందుకు వెళ్తుందని శనివారం ఆమె వెల్లడించారు. కొత్త విధానంలో భాగంగా వ్యూహాత్మక రంగాల జాబితాను నోటిఫై చేస్తామని, ఒక్కో కీలక రంగంలో ప్రైవేట్‌ కంపెనీలతోపాటు గరిష్ఠంగా నాలుగు పీఎస్‌యూలు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఇతర రంగాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలను క్రమానుగతంగా ప్రైవేటీకరిస్తామని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. 

ఏజీ అభిప్రాయంపై జీఎస్టీ కౌన్సిల్‌లో..

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిహారంపై రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే అటార్నీ జనరల్‌ (ఏజీ) అభిప్రాయాన్ని తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ అభిప్రాయంపై చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు శనివారం ఆమె వెల్లడించారు. జీఎస్టీ పరిహారంపై ఏజీ వ్యక్తం చేసిన అభిప్రాయం పట్ల కొన్ని రాష్ర్టాలు ఆందోళన వ్యక్తం చేసినట్టు వస్తున్న వార్తలపై నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ.. ఈ అంశంపై గత సమావేశంలోనే జీఎస్టీ కౌన్సిల్‌ సభ్యులు చర్చించించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని, దీనిపై ఏజీ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని ఆ సమావేశంలోనే నిర్ణయం జరిగిందని వివరించారు. ఈ నిర్ణయం మేరకు జీఎస్టీ పరిహారంపై ఏజీ తన అభిప్రాయాన్ని తెలియజేశారని చెప్పారు. దీనిపై చర్చించేందుకు ప్రత్యేకంగా జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహిస్తామని, ఈ సమావేశ తేదీని త్వరలోనే ఖరారు చేస్తామని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

జీఎస్టీ వసూళ్లు 87 వేల కోట్లు

గతనెలకుగాను రూ.87,422 కోట్ల జీఎస్టీ పన్ను వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జూన్‌లో వసూలైన రూ.90,917 కోట్లతో పోలిస్తే మాత్రం స్వల్పంగా తగ్గినప్పటికీ, మే నెలలో వసూలైన రూ.62 వేల కోట్లు, ఏప్రిల్‌లో వసూలైన రూ.32,294 కోట్లతో పోలిస్తే మాత్రం అధికంగా నమోదయ్యాయి. జూలై, 2020లో రూ. 87, 422 కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లలో సెంట్రల్‌ జీఎస్టీ కింద రూ.16,147 కోట్లు, స్టేట్‌ జీఎస్టీ కింద రూ.21,418 కోట్లు, ఐంటిగ్రేటెడ్‌ జీఎస్టీ కింద రూ.42,592 కోట్లు(దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన రూ.20,324 కోట్లు కలుపుకొని), సెస్‌ రూపంలో రూ.7,265 కోట్లు వచ్చాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో వసూలైన రూ.1.02 లక్షల కోట్లలో 86 శాతం గత నెలలో వసూలయ్యాయి. కరోనా కారణంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు పన్నులు చెల్లించని వారు జూన్‌లో అత్యధికంగా చెల్లింపులు జరుపడం వల్లనే అధికంగా వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత నెలలో సీజీఎస్టీ కింద రూ.23,320 కోట్ల చెల్లింపులు జరిపిన కేంద్రం..ఐజీఎస్టీ కింద రాష్ర్టాలకు రూ.18,838 కోట్లను చెల్లించింది. logo