శుక్రవారం 07 ఆగస్టు 2020
Business - Feb 14, 2020 , 00:09:26

టీవీ దిగుమతులపై ఆంక్షలు?

టీవీ దిగుమతులపై ఆంక్షలు?

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: టెలివిజన్‌ దిగుమతులపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దేశంలోకి ప్రాధాన్యం లేని ఉత్పత్తుల దిగుమతుల్ని తగ్గించాలన్న లక్ష్యంలో భాగంగానే విదేశాల నుంచి వస్తున్న టెలివిజన్‌ సెట్లపై పరిమితుల్ని విధించాలని మోదీ సర్కారు భావిస్తున్నది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, వాణిజ్య మంత్రిత్వ శాఖలు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై చర్చిస్తున్నాయని సంబంధిత వర్గాల సమాచారం. కాగా, ఆంక్షలతో కూడిన దిగుమతి వస్తువుల్లోకి టెలివిజన్లను తెస్తే.. విదేశాల నుంచి టెలివిజన్లను భారత్‌లోకి తీసుకురావడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) నుంచి లైసెన్సును పొందాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) దేశంలోకి టెలివిజన్ల దిగుమతుల విలువ దాదాపు రూ.7 వేల కోట్లుగా ఉన్నది. ఇందులో చైనా వాటానే అత్యధికంగా 535 మిలియన్‌ డాలర్లు. ఆ తర్వాత వియత్నాం (327 మిలియన్‌ డాలర్లు), మలేషియా (109 మిలియన్‌ డాలర్లు), హాంకాంగ్‌ (10.52 మిలియన్‌ డాలర్లు), కొరియా, ఇండోనేషియా, థాయిలాండ్‌, జర్మనీ దేశాలున్నాయి. కాగా, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఫర్నీచర్‌ ఉత్పత్తులపైనా ఆంక్షలు పెట్టాలని కేంద్రం చూస్తున్నది. తద్వారా దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనుకుంటున్నది. ఇప్పటికే రిఫైన్డ్‌ పామాయిల్‌ దిగుమతులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.


logo