Tesla Waiting | న్యూ టెస్లా కారు కొనాలని ప్లాన్ చేసుకున్నారా.. అయితే ప్రస్తుతానికి టెస్లా వద్ద కార్ల నిల్వలేమీ లేవు.. కొత్త టెస్లా కారు బుకింగ్ చేసుకుంటే దాని స్టీరింగ్ మీ చేతికి చిక్కడానికి మరింత జాప్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, లాప్టాప్ కంప్యూటర్లకు గిరాకీ పెరిగింది. కానీ వాటిలో వాడే సెమీ కండక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా కొరత ఏర్పడింది. టెక్నాలజీ యుగంలో కార్లలోనూ సెమీ కండక్టర్ల వాడకం తప్పనిసరి. వీటి కొరతతో కార్ల తయారీ సంస్థలన్నీ అల్లాడుతున్నాయి.
సెమీ కండక్టర్ల కోసం బహిరంగ మార్కెట్లో అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తున్నది. టెస్లాదైనా.. స్టార్టప్ సంస్థదైనా ఇదే సమస్య. దీనివల్ల టెస్లా మోడల్-3 ధర మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెస్లా కారు కోసం మూడు నెలలు వెయిట్ చేయాలని ఆ సంస్థ వెబ్సైట్ చెబుతోంది. ఇంతకుముందు అంచనా ప్రకారం టెస్లా కారు బుకింగ్ చేసుకున్నవారు డిసెంబర్ వరకు వేచి ఉండాల్సిందే. టెస్లా ట్రాక్ రికార్డు ప్రకారం చివరి క్షణాల్లో మరింత… అంటే మరో నెల జాప్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంటే 2022లో గానీ టెస్లా కారు కస్టమర్ల చేతికి వస్తుందన్నమాట.
అంటే మీరు టెస్లా మోడల్ వై కోసం ఫిబ్రవరి వరకు వెయిట్ చేయక తప్పక పోవచ్చు. ఇక మరింత పాపులర్ మోడల్ కార్లు ఎస్.. ఎక్స్ కోసమైతే ఏప్రిల్ దాకా ఆగాల్సిందే.