శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Dec 29, 2020 , 00:11:19

టెస్లా వచ్చేస్తున్నది

టెస్లా వచ్చేస్తున్నది

అతిత్వరలో భారత్‌లో కార్ల అమ్మకాలు 

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ధ్రువీకరణ

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ప్రపంచ దిగ్గజంగా పేరుపొందిన అమెరికన్‌ సంస్థ ‘టెస్లా’ అతిత్వరలో భారత్‌లోకి అడుగుపెట్టనున్నది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 2021 ఆరంభంలో టెస్లా భారత్‌లో కార్ల అమ్మకాలను ప్రారంభించబోతున్నదని, కొనుగోలుదారుల నుంచి వచ్చే స్పందనను బట్టి దేశీయంగా మాన్యుఫ్యాక్చరింగ్‌, అసెంబ్లింగ్‌ ప్లాంట్లను ఏర్పాటుచేసే వియాన్ని టెస్లా పరిశీలిస్తుందని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్‌ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టెస్లా భారత్‌కు రావాలని దేశీయ అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. వీరి ఆకాంక్ష 2021లో నెరవేరుతుందని టెస్లా సంస్థ అధిపతి ఎలాన్‌ మస్క్‌ కూడా ఆదివారం ట్వీట్‌ చేశారు. అయితే భారత్‌లో టెస్లా కార్ల తయారీకి ఉపయోగించే సామగ్రిలో కనీసం 30 శాతం స్థానిక సామగ్రి ఉండాలన్న నిబంధనతో తమ ప్రణాళికలు ఆలస్యమవుతున్నాయని ఆయన తెలిపారు. ఎంతో కాలం నుంచి భారత్‌కు దూరంగా ఉన్న టెస్లా.. చైనాలోని షాంఘైలో ఓ కర్మాగారాన్ని నడుపుతున్నది. ప్రస్తుతం ఆ కర్మాగారంలో మోడల్‌-3 కార్లను టెస్లా అసెంబ్లింగ్‌ చేస్తున్నది. ఇకపై ఆ ప్లాంట్‌ను మోడల్‌-వై కార్ల అసెంబ్లింగ్‌కు ఉపయోగించాలని టెస్లా భావిస్తున్నది. ప్రస్తుతం టెస్లా దాదాపు 659 బిలియన్‌ డాలర్ల (రూ. 48,45,702 కోట్ల) మార్కెట్‌ విలువతో ప్రపంచంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా కొనసాగుతున్నది. జపాన్‌ ఆటోమొబైల్‌ కంపెనీ టయోటా మార్కెట్‌ విలువ (రూ.15,80, 920 కోట్లు) కంటే ఎంతో ముందున్న టెస్లా కరోనా సంక్షోభ సమయంలోనూ బాగానే రాణించింది. గత త్రైమాసికంలో ఆ సంస్థ 8.77 బిలియన్‌ డాలర్ల (రూ. 64,486 కోట్ల) ఆదాయాన్ని ఆర్జించిన టెస్లా.. ఇటీవల ఎస్‌అం2డ్‌పీ 500 సూచీలోనూ చోటు దక్కించుకోవడం గమనార్హం.

VIDEOS

logo