ఆదివారం 31 మే 2020
Business - May 12, 2020 , 20:15:16

పదేండ్లు ట్యాక్స్‌ హాలీడే

పదేండ్లు ట్యాక్స్‌ హాలీడే

న్యూఢిల్లీ: దేశంలోకి కొత్త పెట్టుబడులను తీసుకొచ్చే కంపెనీలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. కరోనా కాటుతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తున్న నేపథ్యంలో వాణిజ్యశాఖ ఈ ప్రతిపాదన చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్తగా 500 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు పదేండ్లపాటు పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వాలన్న ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థికశాఖ పరిశీలిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. మెడికల్‌ డివైజెస్‌, ఎలక్ట్రానిక్స్‌, టెలికం ఎక్విప్‌మెంట్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ లాంటి రంగాలకు ట్యాక్స్‌ హాలీడే ఇచ్చేలా వాణిజ్యశాఖ ఈ ప్రతిపాదన చేసిందని, దీని ద్వారా లబ్ధి పొందాలనుకొనే కంపెనీలు జూన్‌ 1 నుంచి మూడేండ్ల వ్యవధిలోగా తమ కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంటుందని ఆ వర్గాలు వివరించాయి. ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి కల్పించే టెక్స్‌టైల్స్‌, ఫుడ్‌ప్రాసెసింగ్‌, లెదర్‌, ఫుట్‌వేర్‌ లాంటి రంగాల్లో 100 మిలియన్‌ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు నాలుగేండ్ల పాటు పన్ను మినహాయింపు ఇవ్వాలని వాణిజ్యశాఖ ప్రతిపాదించినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనను ఆర్థికశాఖ ఆమోదించాల్సి ఉండగా.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 


logo