సోమవారం 03 ఆగస్టు 2020
Business - Jul 02, 2020 , 00:31:52

జీఎస్టీలో మనమే మేటి

జీఎస్టీలో మనమే మేటి

  • రాష్ట్రంలో రూ.3,276 కోట్లు వసూలు 
  • గత ఏడాదితో పోల్చితే జూన్‌లో 3 శాతం అధికం
  • సంక్షోభంలోనూ తెలంగాణలో తగ్గని జోరు
  • జాతీయ సగటు వసూళ్లలో 3 శాతం లోటు
  • గుజరాత్‌, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ర్టాలూ మన వెనుకే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా సంక్షోభంలోనూ జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూసుకుపోయింది. లాక్‌డౌన్‌ కాలంలో ఆదాయం తగ్గినా గత నెలలో ఆంక్షలను సడలించడంతో రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు మళ్లీ పుంజుకున్నాయి. జీఎస్టీ వసూళ్లు అంచనాలకు మించి పెరిగాయి. జూన్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.3,276 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది జూన్‌తో పోల్చితే 3 శాతం అధికంకావడం గమనార్హం. అదే సమయంలో జాతీయ సగటు జీఎస్టీ వసూళ్లు మూడుశాతం పడిపోయాయి. జూన్‌లో దేశ వ్యాప్తంగా రూ.90,917 కోట్ల వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఏప్రిల్‌లో రూ.32,294 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు.. ఆ తర్వాతి నెలలో రూ.62,009 కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాది జూన్‌లో వసూలైన దాంతో పోలిస్తే 9 శాతం తగ్గగా, అదే మే నెలలో 62 శాతం, ఏప్రిల్‌లో 28 శాతం చొప్పున పడిపోయాయి. 

క్రమంగా సాధారణ స్థితికి.. 

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఆర్థిక లావాదేవీలు పాక్షికంగా స్తంభించిపోయాయి. జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. ‘అన్‌లాక్‌-1’ ప్రక్రియలో భాగంగా ఆంక్షలను సడలించడంతో పరిశ్రమలు తిరిగి తెరుచుకున్నాయి. అమ్మకాలు, కొనుగోళ్లు పునఃప్రారంభమయ్యాయి. వైరస్‌వ్యాప్తిని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేయడం, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు వాటిని పాటిస్తుండటంతో ప్రజల్లో భరోసా పెరిగింది. వ్యాపార, వాణిజ్య లావాదేవీలు క్రమంగా సాధారణస్థాయికి చేరుకుంటున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు ఈ ఏడాది మార్చిలో తెలంగాణ జీఎస్టీ వసూళ్లు దాదాపు రూ.3,600 కోట్లుగా నమోదయ్యాయి. జూన్‌లో రూ.3,276 కోట్లుగా ఉన్నాయి. అంటే లాక్‌డౌన్‌ ముందుకు ఇప్పటికి ఉన్న వ్యత్యాసం కేవలం రూ.300 కోట్లు మాత్రమే.

తెలంగాణ వెనుకే పెద్ద రాష్ర్టాలు

‘ఎవరు ఏమన్నా తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రమే’.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇవి. తాజా జీఎస్టీ వసూళ్లే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. కరోనా విపత్తుతో ప్రపంచవ్యాప్తంగా ఆదాయం పడిపోతున్న వేళ తెలంగాణ మాత్రం గత ఏడాదికి మించి వసూళ్లు సాధించింది. 2019 జూన్‌ నెలతో పోల్చితే వసూళ్లు 3 శాతం పెరిగాయి. జీఎస్టీ వసూళ్లు సాధించే రాష్ర్టాలను పరిశీలిస్తే.. 

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ ఆదాయం 6 శాతం పడిపోయింది. 

దేశ రాజధాని ఢిల్లీ ‘-10 శాతం’, దేశ వాణిజ్య రాజధాని ముంబై ఉన్న మహారాష్ట్ర ‘-1’ శాతం నమోదుచేశాయి. 

తమిళనాడు (-15 శాతం), ఉత్తరప్రదేశ్‌ (-3శాతం), హర్యానా (-24శాతం), పశ్చిమబెంగాల్‌ (-11శాతం) రాష్ర్టాలు తెలంగాణ కన్నా వెనుకబడే ఉన్నాయి.

పూర్తి జీతాలు చెల్లించినప్పటికీ..

‘రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం.. దాన్ని ప్రజలకు పంచడం’ అనేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటినుంచీ అవలంబిస్తున్న విధానం. అన్నివర్గాల ప్రజలను ఆదుకునేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. కరోనా విపత్తుతో రాష్ట్ర ఆదాయం అనూహ్యంగా తగ్గడంతో ఉద్యోగుల వేతనాల్లో కొంత కోత విధించింది. సంక్షేమాన్ని మాత్రం ఆపలేదు. మూడునెలల్లోనే సంక్షేమ పథకాల కోసం దాదాపు రూ.15 వేల కోట్లకుపైగా వెచ్చించింది. 

2019 జూన్‌లో : రూ.3,166 కోట్లు 

2020 జూన్‌లో : రూ.3,276 కోట్లు 

తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 

గత ఏడాది కంటే 3% అధికం (రూ.110 కోట్లు)

జాతీయ సగటు 3% శాతం తగ్గుదల


logo