హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టం (అనుకూల వాతావరణం) జాతీయంగానేగాక అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు విభిన్న కేటగిరిల్లో తెలంగాణ టాప్-30లో నిలిచింది. స్టార్టప్ జినోమ్, గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెట్‌వర్క్‌లు కలిసి గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్టు (జీఎస్‌ఈఆర్)-2021ను బుధవారం విడుదల చేశాయి. ఇందులో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అతిపెద్ద నివేదికగా చెప్పుకునే జీఎస్‌ఈఆర్-2021లో రాష్ర్టానికి స్థానం దక్కడం తమకు గర్వకారణంగా ఉందని టీ-హబ్ సీఈవో రవి నారాయణ్ ఈ సందర్భంగా అన్నారు. ఇందులో ప్రధానంగా టీ-హబ్‌తోపాటు టీఎస్ఐసీ, వీ-హబ్, టాస్క్, రిచ్, టీ-వర్క్స్, తెలంగాణ ఇన్నోవేషన్ నెట్వర్క్ భాగస్వాములు కీలకంగా ఉన్నారని తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 280కిపైగా ఎకోసిస్టంలను మూల్యంకనం చేసిన స్టార్టప్ జినోమ్.. 140 ప్రధాన ఎకోసిస్టంలకు ర్యాంకులనిచ్చింది.
‘స్టార్టప్ తెలంగాణ పోర్టల్’ను మరింతగా విస్తరించేందుకు రాష్ట్ర స్థాయిలో స్టార్టప్‌లకు ప్రత్యేకంగా గుర్తింపు వచ్చేలా చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. చక్కని ఆలోచన, దాన్ని ఆచరణలో పెట్టే సాంకేతిక నైపుణ్యం ఉంటే చాలు పెట్టుబడులతో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వివిధ రంగాలకు చెందిన పెట్టుబడిదారుల నుంచి మద్దతు కూడగట్టేందుకు వేదికగా ఈ వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దారు.
మెరుగైన నైపుణ్యంలో టాప్-15
ఫండింగ్‌లో టాప్-20
విజ్ఞానం, ఆవిష్కరణల్లో టాప్-30
పనితీరులో టాప్-30
ప్రతిభ, అనుభవంలో టాప్-30
నియామకాల్లో సాయం, పనితీరు
ప్రోత్సాహకాలతో తెలంగాణకు స్టార్టప్‌లు