సోమవారం 30 మార్చి 2020
Business - Mar 01, 2020 , 23:50:52

ఎలక్ట్రానిక్‌ లావాదేవీల్లో మనమే నం.1

ఎలక్ట్రానిక్‌ లావాదేవీల్లో మనమే నం.1
  • డిజిటల్‌ తెలంగాణ సాకారం కోసం ఐటీ శాఖ కృషి
  • ఐదేండ్లలో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు
  • ఈఎస్డీ ద్వారా 50 శాఖల్లో 500లకుపైగా సేవలు

‘ఈ-గవర్నెన్స్‌'తో సేవల్లో పారదర్శకత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పారదర్శక పాలనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతున్నది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌ ఐటీశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘ఈ-గవర్నెన్స్‌'పై ప్రత్యేక దృష్టి సారించారు. వినియోగదారులకు, పౌరులకు మెరుగైన సేవలందించడంలో జవాబుదారీతనం, పారదర్శకత పెంచేందుకు కృషిచేస్తున్నారు. ప్రభుత్వం-ప్రభుత్వం, ప్రభుత్వం-పౌరులు, ప్రభుత్వం-వ్యాపారస్తులు, వ్యాపారస్తులు-వినియోగదారులు మధ్య సేవల్లో తెలంగాణ ఐటీశాఖ కీలకపాత్ర పోషిస్తున్నది. మంత్రి కేటీఆర్‌ మార్గనిర్దేశంతో ఇప్పటికే తెలంగాణ ఐటీశాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించడంలో తెలంగాణ ఐటీ శాఖ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. 


నాలుగేండ్లుగా మొదటి స్థానంలోనే..

ఐటీశాఖలోని ఈఎస్డీ (ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ) విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 4,500లకుపైగా మీసేవ కేంద్రాలు ప్రజలకు సమర్థంగా సేవలు అందిస్తున్నాయి. మీసేవ కేంద్రాల ద్వారా ప్రతిరోజు లక్ష నుంచి లక్షన్నర లావాదేవీలు జరుగుతున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు 13.68 కోట్ల లావాదేవీలు జరిగాయి. ప్రభుత్వానికి సంబంధించిన 50 శాఖల్లో 500లకుపైగా సేవలను ఈఎస్డీ అందిస్తున్నది. 4,500లకుపైగా మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలు జరుపుతున్న ఎలక్ట్రానిక్‌ లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్నట్టు ఈతాల్‌ పోర్టల్‌ సర్వే తెలిపింది. ఎలక్ట్రానిక్‌ లావాదేవీల్లో నాలుగేండ్లు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలోనే నిలుస్తున్నది.


సాంకేతికతతో స్మార్ట్‌ గవర్నెన్స్‌

పౌర సేవలందించడం కోసం ఈఎస్డీ విభాగం ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొంటున్నది. బిగ్‌డాటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతికతను పౌరసేవల్లో వినియోగించుకుంటున్నది. ఐటీశాఖ ముఖ్యంగా స్మార్ట్‌ గవర్నెన్స్‌పై దృష్టిసారించింది. పౌరసేవలు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఆధార్‌ స్లాట్‌ బుక్కింగ్‌ కోసం టీ-యాప్‌ ఫోలియో, రియల్‌ టైం డిజిటల్‌ అథెంటికేషన్‌ ఆఫ్‌ ఐడెంటిటీ, టీ-వ్యాలెట్‌, ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం (ఏఈపీఎస్‌) వంటి కార్యక్రమాల ద్వారా అత్యుత్తమ సేవలను ప్రజలకు అందిస్తున్నది. 


అనేక అవార్డులు, గుర్తింపులు

దేశంలో ఈ-గవర్నెన్స్‌ క్యాటగిరీలో అందించే అన్ని అవార్డులను ఐటీశాఖలోని ఈఎస్డీ విభాగం ఇప్పటికే పొందింది. మీసేవల ద్వారా తక్కువ సమయంలో 13.5 కోట్ల లావాదేవీలను జరిపిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. పౌర సేవలను సమర్థంగా అందిస్తున్నందుకుగానూ తెలంగాణ మీసేవ విభాగానికి పలు సదస్సుల్లో ఆరు అవార్డులు, బెస్ట్‌ మొబైల్‌ యాప్‌నకు ఐదు అవార్డులు, టీ-వ్యాలెట్‌కు రెండు అవార్డులు దక్కాయి.


పారదర్శక సేవలే లక్ష్యం

మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు ప్రజలకు ప్రభుత్వసేవలను అందించడంలో దళారుల వ్యవస్థను తొలిగించి, పారదర్శక సేవలు అందించడమే లక్ష్యం పనిచేస్తున్నాం. సౌకర్యవంతమైన, పారదర్శక సేవలే ఈ-గవర్నెన్స్‌ ముఖ్య ఉద్దేశం. మీసేవలు, టీ-యాప్‌ ఫోలియో, టీ-వ్యాలెట్‌ ద్వారా ప్రజలకు సమర్థంగా సేవలందిస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరమూ నాలుగైదు అవార్డులు వస్తున్నాయి. తెలంగాణ ఐటీశాఖ పనితీరుకు ఇది నిదర్శనం. 

- జీటీ వెంకటేశ్వర్‌రావు, ఈఎస్డీ కమిషనర్‌


వివిధ విభాగాల్లో రాష్ర్టానికి దక్కిన అవార్డులు

‘మీసేవ’ అవార్డులు 

2018లో వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సదస్సులో డబ్ల్యూఐటీఎస్‌ఏ చైర్మన్స్‌ అవార్డు ప్రభుత్వ విభాగాల్లో ఆవిష్కరణలకు 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘నేషనల్‌ ఈ-గవర్నెన్స్‌' అవార్డు

 2018లో బిజినెస్‌ వరల్డ్‌-ఈ-గవర్నెన్స్‌ ఇనిషియేటివ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు

పౌర సేవల్లో అద్భుత పనితీరుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 2014లో నేషనల్‌ ఈ-గవర్నెన్స్‌ అవార్డు

2017లో స్కోచ్‌ డిజిటల్‌ ఇన్‌క్లూజన్‌ అవార్డు 2017లోనే జెమ్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఇండియా అవార్డు


టీ-యాప్‌..

 2018లో డిజిటల్‌ ఇండియా అవార్డుల సందర్భంగా బెస్ట్‌ మొబైల్‌ యాప్‌ క్యాటగిరీలో అవార్డు

2018లో బెస్ట్‌ మొబైల్‌ యాప్‌ క్యాటగిరీలో బిజినెస్‌ వరల్డ్‌ అవార్డు

 2019లో పౌరసేవల్లో భాగంగా బెస్ట్‌ మొబైల్‌ యాప్‌ క్యాటగిరీలో ఎక్స్‌ప్రెస్‌ ఐటీ అవార్డు

2019లో గవర్నెన్స్‌ నౌ నుంచి డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అవార్డు

2019లో పౌర సమాచారానికి అత్యంత భద్రత కల్పించే యాప్‌ క్యాటగిరీలో సీఐఎస్వో మాగ్‌ అవార్డు


టీ-వ్యాలెట్‌..

అవార్డ్‌ ఆఫ్‌ అప్రిసియేషన్‌ అండర్‌ స్టేట్‌ ప్రాజెక్ట్స్‌ క్యాటగిరీలో సీఎస్‌ఐ ఈ-గవర్నెన్స్‌ అవార్డు-2018

2017లో ఈ-పేమెంట్స్‌ క్యాటగిరీలో స్కోచ్‌ అవార్డు


డ్యాష్‌బోర్డు..

2018లో అనలిటిక్స్‌/బిగ్‌ డేటా క్యాటగిరీలో టెక్నాలజీ సభ అవార్డు


logo