గురువారం 28 మే 2020
Business - May 09, 2020 , 01:44:28

బహుళజాతి సంస్థలకు కేరాఫ్‌ అడ్రస్‌గా తెలంగాణ

బహుళజాతి సంస్థలకు కేరాఫ్‌ అడ్రస్‌గా తెలంగాణ

 • పెట్టుబడులకు అనుకూలం 
 • ఆసక్తి చూపుతున్న బహుళజాతి సంస్థలు
 • ఆకట్టుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 
 • సిద్ధమవుతున్న ప్రత్యేక కార్యాచరణ  

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సమీకరణలను మార్చివేసింది. అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలను దెబ్బతీసింది. నిన్నటివరకూ పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచస్థాయి బ్రాండ్ల ఉత్పత్తులకు చిరునామాగా ఉన్న చైనా..  నేడు కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా మారి ప్రపంచం ఎదుట దోషిగా నిలబడింది. ఈ క్రమంలో చైనా నుంచి తమ పెట్టుబడులను, పరిశ్రమలను తరలించాలని పలు దేశాలు భావిస్తున్నాయి.  చైనాకు ప్రత్యామ్నాయంగా అవి భారత్‌వైపు చూస్తున్నాయి. భారత్‌లో ఇప్పటికే బహుళజాతి సంస్థలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ప్రాధాన్యం పెరుగనున్నది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో చైనా నుంచి తమ పరిశ్రమలను తరలించాలని అమెరికా, జపాన్‌ లాంటి అనేక దేశాలు నిర్ణయించుకుంటున్నాయి. దీంతో ఆ దేశాలకు భారత్‌, ప్రత్యేకించి తెలంగాణ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఖ్యాతినార్జించిన హైదరాబాద్‌.. విదేశీ సంస్థలను ఎక్కువగా ఆకర్షిస్తుండటమే ఇందుకు కారణం. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నది. దేశానికి వచ్చే పరిశ్రమల అవసరాలు, డిమాండ్లు, ప్రాధాన్యాలను తెలుసుకుని తదనుగుణంగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించేందుకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ తయారు చేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

కలిసొస్తున్న ఈవోడీబీ ర్యాంక్‌

సులభతర వ్యాపార నిర్వహణ (ఈవోడీబీ)లో తెలంగాణ గత ఆరేండ్ల నుంచి ముందువరుసలో నిలుస్తున్నది. ఇదిప్పుడు రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కలిసొస్తున్నది. రూ.200 కోట్లకు మించి పెట్టుబడి పెట్టే సంస్థలకు 15 రోజుల్లోనే అనుమతినిచ్చే టీఎస్‌-ఐపాస్‌ చట్టాన్ని 2015లోనే తెలంగాణ సర్కారు అమల్లోకి తెచ్చింది. ఇతర ప్రాజెక్టులకు 30 రోజుల్లో అనుమతి లభిస్తున్నది. అలాగే పారిశ్రామిక, సోలార్‌, ఫుడ్‌ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్‌, గేమింగ్‌ రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విధానాలను రూపొందించింది. తద్వారా పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించింది. ఇక శాంతిభద్రతలకూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేయడం కార్పొరేట్లలో విశ్వాసాన్ని పెంచింది. ఆయా సంస్థల అవసరాలకు తగినట్టుగా యువతలో నైపుణ్యం పెరిగేలా శిక్షణనివ్వడం కూడా పరిశ్రమలను ఆకట్టుకున్నది.

కొదువలేని మౌలిక సదుపాయాలు

తెలంగాణలో ఇప్పుడు జల వనరులకు కొదువేలేదు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ప్రభుత్వం ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నది. ఇందు కోసం రూ.50 వేల కోట్లను ఖర్చు చేస్తున్నది. ఇప్పటికే పలు మార్గాల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి రాగా, త్వరలోనే స్కైవేల నిర్మాణంపై దృష్టి పెట్టనున్నారు. రవాణాకు కావాల్సిన అన్ని సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతున్నది. ఇక దేశంలోనే అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితులు హైదరాబాద్‌ సొంతం. దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది కూడా కలిసొస్తున్నది. పుష్కలంగా ఉన్న భూ వనరులు తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్నాయి. దీంతో రాష్ర్టానికి వచ్చే సంస్థలకు అవసరమైన స్థలాలను ప్రభుత్వం చౌకగానే సమకూరుస్తున్నది. హైటెక్‌సిటీ పరిసరాల్లో ఇప్పటికే పలు అంతర్జాతీయ ఐటీ సంస్థలు తమ కేంద్రాలను నెలకొల్పి కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

కేటీఆర్‌ కీలకపాత్ర

రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ముందు నుంచీ కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆయన మరింత వేగం పెంచారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వాణిజ్య విధానాలను ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివరించిన మంత్రి కేటీఆర్‌.. పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలీకృతులయ్యారు. పలు దేశాల్లో పర్యటించి, అక్కడి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమై టీఎస్‌ఐపాస్‌ గురించి, తమ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం గురించి తెలియజెప్పారు. ముఖ్యంగా దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడం ద్వారా తెలంగాణను అంతర్జాతీయ సమాజానికి ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఇప్పుడు పారిశ్రామికంగా అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు, మానవవనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని విదేశీ సంస్థలకు చాటి చెప్పేలా ఓ కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో ఏర్పడిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు ప్రయత్నించాలని కేంద్ర ప్రభుత్వానికీ సూచించారు.

14 రంగాలకు ప్రాధాన్యం

టీఎస్‌ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) దాదాపు 14 రంగాలకు ప్రాధాన్యమిస్తున్నది. ఐటీ, ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్స్‌, విద్యుత్‌, ప్లాస్టిక్‌, ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, సిమెంట్‌, ఏరోస్పేస్‌, ఆటోమొబైల్స్‌, సౌరశక్తి, నిర్మాణ రంగాలను ప్రోత్సహిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తరువాత దాదాపు 11 వేల పరిశ్రమలు రాష్ర్టానికి వచ్చాయి. వీటిలో 8,500కుపైగా యూనిట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టీఎస్‌ఐఐసీ 39,989 ఎకరాల్లో ఏర్పాటుచేసిన పారిశ్రామిక పార్కుల్లో ఈ యూనిట్లు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా సుమారు 1.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు అంచనా. ఈ సంస్థల్లో ప్రత్యక్షంగా 12 లక్షలు, పరోక్షంగా 20 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. మరో 49 వేల ఎకరాల్లో కొత్తగా 36 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ముచ్చర్లలో 12 వేల ఎకరాల్లో ప్రభుత్వం ఫార్మాసెజ్‌ను ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నది.

ఫార్మా బల్క్‌డ్రగ్‌కు కేంద్రంగా తెలంగాణ

 • ప్రపంచ అవసరాల్లో దాదాపు మూడో వంతు ఇక్కడే ఉత్పత్తి
 • 19 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటవుతున్న ఫార్మాసిటీ 
 • తెలంగాణలో ఇప్పటికే రెండు ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)లు. మరో ఈఎంసీ ఏర్పాటుకు అవకాశం
 • మెడ్‌టెక్‌ సుల్తాన్‌పూర్‌పార్క్‌లో భారీగా వైద్య పరికరాల తయారీ సంస్థలు
 • వరంగల్‌లో వస్తున్న 1,200 ఎకరాల మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
 • ఏరోస్పేస్‌ కోసం ప్రభుత్వ స్థలాలుసిద్ధంప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో పరిశ్రమల స్థాపనకు ఏర్పాట్లు
 • లైఫ్‌సైన్సెస్‌ రంగం మరింత అభివృద్ధికి జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాట్లు


logo