ఆదివారం 29 మార్చి 2020
Business - Feb 17, 2020 , 23:46:44

తెలంగాణ మేథోసంపత్తి అవార్డులు

తెలంగాణ మేథోసంపత్తి అవార్డులు
  • ఏప్రిల్‌ 22న ప్రదానోత్సవం
  • టాప్‌-3 రాష్ర్టాల్లో నిలవాలన్నదే లక్ష్యం: జయేశ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రం మేథోసంపత్తి అవార్డులను ప్రకటించింది. దీనికి టీఎస్‌ఐపీఏ 2020 అని నామకరణం చేసింది. తెలంగాణకు చెందిన ఐపీ ఛాంపియన్ల కోసం ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సంస్థలను గౌరవించాలన్న ఉన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతున్నది. దీనికి సీఐఐ సహకారం అందిస్తున్నది. కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించేవారిని ప్రోత్సహించడంలో భాగంగాఈ అవార్డుల్ని అందజేస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలు, పెద్ద, మధ్యతరహా, చిన్న సంస్థలు, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు వంటి ఏడు విభాగాల్లో అందించనున్న ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది మార్చి 10.  ఏప్రిల్‌ 22న ప్రపంచ మేథోసంపత్తి హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అందజేస్తామని నిర్వహకులు ప్రకటించారు.


బలమైన మేథోసంపత్తి (ఐపీ) వ్యూహంతో విజయవంతంగా ఎదిగిన సంస్థలను ప్రోత్సహించడంతో పాటు.. ఈ వ్యవస్థను అభివృద్ధి పర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ చెప్పారు. మేథోసంపత్తి హక్కులను నమోదు చేయడంలో మొదటి మూడు రాష్ర్టాల్లో నిలవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. మేథోసంపత్తి హక్కుల యజమానులను ప్రోత్సహించడానికి అవసరమయ్యే వ్యవస్థను అభివృద్ధిపరుస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో  సీఐఐ ఛైర్మ న్‌ రాజు మాట్లాడుతూ.. విజ్ఞానం ఆధారంగా పని చేసే వ్యవస్థను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. 


logo