గురువారం 02 జూలై 2020
Business - Jun 02, 2020 , 00:41:59

ఆరేండ్లలో ఐటీ సామర్థ్యం రెట్టింపు

ఆరేండ్లలో ఐటీ సామర్థ్యం రెట్టింపు

  • ఎగుమతులు రయ్‌.. రయ్‌
  • నాడు ఐటీ ఎగుమతులు 66 వేల కోట్లే 
  • నేడు 1.28 లక్షల కోట్లకు పెరుగుదల
  • సుస్థిర పాలనతో తరలివచ్చిన కంపెనీలు 
  • కరోనా కాలంలోనూ రికార్డు వృద్ధి రేటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఐటీ ట్రెండ్‌ మారింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో అనేక ఐటీ కంపెనీలు తెలంగాణకు తరలివచ్చాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, యాపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, ఐబీఎం, ఒరాకిల్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, టెక్‌ మహీంద్ర లాంటి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి. దీంతో ఉద్యోగావకాశాలు పెరిగి ఐటీ నిపుణుల వలసలు తగ్గాయి. ఫలితంగా ఆరేండ్లలోనే ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి. ఈ ప్రస్థానంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కృషి అత్యంత కీలకమైనది.

ఎగుమతులు డబుల్‌

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి రూ.66,276 కోట్లుగా ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతులు ఇప్పుడు రూ.1,28,807 కోట్లకు చేరాయి. అదనంగా 2.10 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. ప్రస్తుతం ఐటీ ఎగుమతుల జాతీయ సగటు వృద్ధి 8.09% ఉండగా, తెలంగాణలో 18% నమోదైంది. జాతీయ ఉపాధికల్పన రేటు 4.93% ఉంటే తెలంగాణలో 7.2% ఉంది. మిగిలిన రాష్ర్టాల కంటే ఇది 50 శాతం ఎక్కువ. 

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ

రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ద్వితీయశ్రేణి నగరాలకూ విస్తరిస్తున్నది. వరంగల్‌లో రూ. 31 కోట్లతో ఐటీ ఇంక్యుబేషన్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. వాంకోడోత్‌ సాఫ్ట్‌వేర్‌ సోల్యూషన్స్‌ సంస్థ జనగామ, హుజురాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఇక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్‌ సంస్థ కరీంనగర్‌లో బీపీవో కేంద్రాన్ని ప్రారంభించగా, రూరల్స్‌ షోర్స్‌ సంస్థ ఖమ్మంలో బీపీవో సెంటర్‌ను ప్రారంభించనున్నది. 

టీహబ్‌ -2

ఐటీ ప్రపంచంలో హైదరాబాద్‌ ఖ్యాతిని పెంచేందుకు మంత్రి కేటీఆర్‌ 2015 నవంబర్‌ 5న టీహబ్‌ను ప్రారంభించారు. దేశంలో ప్రభుత్వ ఆధ్వర్యాన ఏర్పాటైన తొలి ఇంక్యుబేటర్‌ ఇదే. టీహబ్‌ అసాధారణ విజయం తరువాత 4వేల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం టీ హబ్‌ -2ను నిర్మిస్తున్నారు.


logo