హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్ ముందుకొచ్చింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వెహికిల్స్ తదితర రంగాల్లో పెట్టుబడులను తెచ్చేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. దీనిపై త్వరలోనే అక్కడి ప్రముఖ కంపెనీలతో ఒక వర్చువల్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తైవాన్‌కు చెందిన ఆర్థిక, సాంస్కృతిక కేంద్ర (టీఈసీసీ) బృందం బుధవారం ప్రగతి భవన్లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావుతో భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ విధానాలతోపాటు టీఎస్ ఐ-పాస్ గురించి టీఈసీసీ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ నేతృత్వంలోని బృందానికి మంత్రి వివరించారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ ఇతర ప్రధాన రంగాలకు సంబంధించిన పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను తెలిపారు.
అవకాశాలు అపారం: బెన్ వాంగ్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతలు తనకు తెలుసని, ఇక్కడున్న అపారమైన పెట్టుబడి అవకాశాలను తైవాన్ పారిశ్రామిక రంగానికి పరిచయం చేసేందుకు సహకరిస్తానని బెన్ వాంగ్ హామీ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం, ఆసక్తి చూపిస్తున్న ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్ వెహికిల్స్ ఇతర రంగాల్లోని ప్రముఖ కంపెనీలతో ఒక వర్చువల్ ఇన్వెస్ట్మెంట్ సెషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా, టీఈసీసీ, తైవాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ డెవలప్మెంట్ కౌన్సిల్-టీఐఏటీఆర్ఏ, ఇన్వెస్ట్ ఇండియాల సంయుక్త ప్రతినిధి బృందానికి తెలంగాణలో ఉన్న వివిధ పెట్టుబడి అవకాశాలను ఐటీ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్, ఈవీ విభాగాల డైరెక్టర్ సుజయ్ కారంపూడి ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు కూడా పాల్గొన్నారు.
గతంలోనే తైవాన్‌కు వచ్చా..
‘గతంలో తైవాన్ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు నేను స్వయంగా మీ దేశంలో పర్యటించాను’ అని టీఈసీసీ బృందానికి కేటీఆర్ గుర్తుచేశారు. నాడు రాష్ట్రంలోని వ్యాపార అనుకూలతలను గురించి వివరించానన్నారు. తైవాన్ పారిశ్రామిక వర్గాల పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా ఓ ఇండస్ట్రియల్ పార్క్‌ను సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించిన విషయాన్ని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలత, ఇక్కడి మౌలిక వసతుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అనేక రంగాల్లోకి భారీగా పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపారు. తైవాన్-తెలంగాణ మధ్య పెట్టుబడుల విషయంలో సహకరించాల్సిందిగా బెన్ వాంగ్‌ను మంత్రి కోరారు.