బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Jan 18, 2020 , 01:02:14

టీసీఎస్‌ మధ్యంతర డివిడెండ్‌ రూ. 5

 టీసీఎస్‌ మధ్యంతర డివిడెండ్‌ రూ. 5
  • - క్యూ3లో రూ.8,118 కోట్ల లాభం

ముంబై, జనవరి 17: దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థయైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.8,118 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఏడాది ఇదే కాలానికి నమోదైన రూ.8,105 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం 0.2 శాతం వృద్ధి నమోదైంది. నిర్వహణ లాభం మాత్రం 4.3 శాతం పెరిగి రూ.9,564 కోట్లకు చేరుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 6.7 శాతం ఎగబాకి రూ.39,854 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఏడాది ఇది రూ.37,338 కోట్లుగా ఉన్నది.


తొలి ఆరు నెలల్లో సంస్థాగత నిర్ణయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని, గత త్రైమాసికంలో ఆర్డర్లు భారీగా పెరుగడంతో లాభాల్లో వృద్ధికి దోహదపడినట్లు, టెక్నాలజీ సొల్యుషన్స్‌పై నూతన పరిశోధనలు చేయడం కలిసివస్తున్నదని టీసీఎస్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ గోపినాథన్‌ తెలిపారు. కస్టమర్లతో సత్ససంబంధాలు కలిగివుండటం కూడా వృద్ధికి పరోక్షంగా దోహదం చేసిందన్నారు. తొలి ఆరు నెలల్లో నమోదైన మందకొడి వృద్ధి కారణంగా ఈ ఏడాది రెండంకెల వృద్ధి అసాధ్యమని వ్యాఖ్యానించారు. గతేడాది 11.4 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థ..ఈ ఏడాది 8 శాతం కంటే అధిక వృద్ధి సాధిస్తే ఇదే సంతోషమని ఆర్థిక ఫలితాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. అక్టోబర్‌ త్రైమాసికంలో ప్రత్యేక డివిడెండ్‌ కింద రూ.20 వేల కోట్లు చెల్లింపులు జరుపడంతో నికర లాభాల్లో క్షీణతకు కారణమన్నారు.

ఆర్థిక ఫలితాల్లోని ముఖ్య అంశాలు..

-రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5 లేదా 500 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ ఏడాది డివిడెండ్‌ ప్రకటించడం ఇది మూడోసారి. ఈ నెల 25న వాటాదారులకు డివిడెండ్‌ చెల్లింపులు జరుపబోతున్నది.
-డిసెంబర్‌ 31 నాటికి సంస్థ 5,006 పెటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నది. గత త్రైమాసికంలో దరఖాస్తు చేసుకున్న 132 కూడా ఉన్నాయి. వీటిలో 1,211 పెటెంట్లకు అనుమతులు లభించాయి.
-ఉద్యోగుల వలసలు 12.2 శాతంగా నమోదయ్యాయి. ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్యకాలంలో నికరంగా 22 వేల మందిని రిక్రూట్‌ చేసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 4,46,675కి చేరుకున్నారు.
-బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాలకు చెందిన క్లయింట్లను అత్యధికంగా ఆకట్టుకున్నది.
-స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర స్పల్పంగా తగ్గి రూ.2,220.90 వద్ద ముగిసింది.
-2019-20 తొలి తొమ్మిది నెలల్లో ఆదాయంలో వృద్ధి 7.9 శాతంగా ఉన్నది.
-మూడో త్రైమాసికంలో సంస్థ 6 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నది. దీంతో ఏడాది కుదుర్చుకున్న ఒప్పందాల విలువ 18 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. గతేడాదితో పోలిస్తే 22 శాతం అధికం.
-పెట్టుబడుల ఫండ్‌ రూ.54 వేల కోట్ల నుంచి రూ.43 వేల కోట్లకు తగ్గాయి.
-కంపెనీ షేరు ధర 0.91 శాతం తగ్గి రూ.2,218.05 వద్ద ముగిసింది. 


logo
>>>>>>