సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 10, 2020 , 00:44:38

టీసీఎస్‌ ప్రాఫిట్‌ డౌన్‌

టీసీఎస్‌ ప్రాఫిట్‌ డౌన్‌

 • క్యూ1లో 14% తగ్గిన లాభం.. రూ.7,008 కోట్లుగా నమోదు.. 
 • రూ.38 వేల కోట్లకు ఆదాయం.. రూ.5 డివిడెండ్‌ ప్రకటన

ముంబై, జూలై 9: దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలానికి)గాను రూ.7,008 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2019-20 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.8,131 కోట్లతో పోలిస్తే 13.8 శాతం క్షీణించింది. కరోనా వైరస్‌తో అంతర్జాతీయ వ్యాపారంపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపినప్పటికీ, మార్చిలో కొంతమే ప్రభావం పడిందన్న దేశీయ ఐటీ దిగ్గజం..లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికపు పనితీరుపై ప్రతికూల ప్రభావం పడిందని వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.38,172 కోట్ల నుంచి రూ.38,322 కోట్లకు పెరిగినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది.

 ఆర్థిక ఫలితాల్లో ముఖ్యాంశాలు..

 • ఆదాయంలో 6.3 శాతం వృద్ధి నమోదైంది.
 • లైఫ్‌ సైన్స్‌ 13.8 శాతం, ఇండస్ట్రీ 23.6 శాతం వృద్ధి కనబరిచింది. కానీ, బీఎఫ్‌ఎస్‌ఐ(-4.9 శాతం), రిటైల్‌ అండ్‌ ఏఎంపీ(-12.9 శాతం), కమ్యూనికేషన్స్‌ అండ్‌ మీడియా (-3.6 శాతం), తయారీ(-7.1 శాతం), టెక్నాలజీ సర్వీసులు(-4 శాతం) రంగాలు నిరాశపరిచాయి. 
 • 6.9 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నది.
 • ఆపరేటింగ్‌ మార్జిన్‌ 23.6 శాతం, నికర మార్జిన్‌ 18.3 శాతంగా ఉన్నది
 • కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో యూరప్‌ వాటా(2.7 శాతం), ల్యాటిన్‌ అమెరికానుంచి పెరిగాయి. కానీ, ఉత్తర అమెరికా(-6.1 శాతం), బ్రిటన్‌(-8.5 శాతం), భారత్‌(- 27.6 శాతం), ఆసియా పసిఫిక్‌(-3.2 శాతం), ఎంఈఏ(-11.7శాతం) పడిపోయాయి. 
 • 4,43,676 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 36.2 శాతం మంది మహిళలు. వలసలు 11.1 శాతంగా ఉన్నాయి. 
 • ప్రతిషేరుకు రూ.5 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. 
 • హెచ్‌1-బీ వీసాలను నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో అక్కడి వ్యాపారాన్ని నియంత్రించబోతున్నట్లు టీసీఎస్‌ ప్రకటించింది. 
 • కంపెనీ షేరు ధర స్వల్పంగా పడిపోయింది.

కరోనా మహమ్మారితో ఆదాయంపై ప్రభావం పడుతుందని ముందుగానే అంచనావేశాం. లైఫ్‌ సైన్స్‌, హెల్త్‌కేర్‌ రంగాలు మినహా అన్ని రంగాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. సంస్థపై క్లయింట్లు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పలు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనంగా ఉన్నప్పటికీ భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాం.  ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి తిరిగి కోలుకుంటాం”

- రాజేశ్‌ గోపినాథన్‌, టీసీఎస్‌ సీఈవో, ఎండీ


logo