గురువారం 04 జూన్ 2020
Business - May 13, 2020 , 01:00:34

పదేండ్లు ట్యాక్స్‌ హాలిడే

పదేండ్లు ట్యాక్స్‌ హాలిడే

  • భారీగా కొత్త పెట్టుబడులు తీసుకొచ్చే కంపెనీలకే
  • వాణిజ్యశాఖ ప్రతిపాదనలపై ఆర్థికశాఖ పరిశీలన

న్యూఢిల్లీ, మే 12: దేశంలోకి కొత్త పెట్టుబడులను తీసుకొచ్చే కంపెనీలకు ట్యాక్స్‌ హాలిడే (పన్ను మినహాయింపు) ఇవ్వాలని వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. కరోనా కాటుతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తున్న నేపథ్యంలో వాణిజ్యశాఖ ఈ ప్రతిపాదన చేసినట్టు ఈ వ్యవహారం గురించి తెలిసిన అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్తగా 500 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు పదేండ్లపాటు పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వాలన్న ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థికశాఖ పరిశీలిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. మెడికల్‌ డివైజెస్‌, ఎలక్ట్రానిక్స్‌, టెలికం ఎక్విప్‌మెంట్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ లాంటి రంగాలకు పన్ను మినహాయింపు ఇచ్చేలా వాణిజ్యశాఖ ఈ ప్రతిపాదన చేసిందని, దీని ద్వారా లబ్ధి పొందాలనుకొనే కంపెనీలు జూన్‌ 1 నుంచి మూడేండ్ల వ్యవధిలోగా తమ కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంటుందని ఆ వర్గాలు వివరించాయి. ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి కల్పించే టెక్స్‌టైల్స్‌, ఫుడ్‌ప్రాసెసింగ్‌, లెదర్‌, ఫుట్‌వేర్‌ లాంటి రంగాల్లో 100 మిలియన్‌ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు నాలుగేండ్ల పాటు పన్ను మినహాయింపు ఇవ్వాలని, అలాగే వచ్చే ఆరేండ్లపాటు కార్పొరేట్‌ పన్ను రేటును 10 శాతానికి తగ్గించాలని వాణిజ్యశాఖ ప్రతిపాదించినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనను ఆర్థికశాఖ ఆమోదించాల్సి ఉన్నది. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

మౌలిక వసతులమెరుగుదల కోసం..

మరోవైపు దేశంలోని ఇండస్ట్రియల్‌ క్లస్టర్లలో మౌలిక సదుపాయాలతోపాటు టెస్టింగ్‌ ల్యాబ్‌లు, పరిశోధన, అభివృద్ధి (రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) కేంద్రాలను మెరుగుపరిచేందుకు వాణిజ్యశాఖ టాప్‌-50 క్లస్టర్లను గుర్తించింది. టెక్స్‌టైల్స్‌, ఫార్మా, ఫుడ్‌ప్రాసెసింగ్‌, జెమ్స్‌ అండ్‌ జ్యువెల్లరీ లాంటి రంగాలకు ఊతమివ్వాలన్న లక్ష్యంతో వాణిజ్యశాఖ ఈ క్లస్టర్లను గుర్తించిందని, పర్యాటక, సేవా రంగాలు సహా మరికొన్ని ఇతర రంగాలను కూడా చేర్చి ఈ జాబితాను మరింత విస్తరించేందుకు ఆ శాఖ కసరత్తు చేస్తున్నదని అధికార వర్గాలు తెలిపాయి.


logo