ఆదివారం 29 మార్చి 2020
Business - Feb 04, 2020 , 23:45:32

పన్ను భయాలు రూపుమాపడం అసాధ్యమే!

పన్ను భయాలు రూపుమాపడం అసాధ్యమే!
  • బడ్జెట్‌పై ఆస్కి, ఫిక్కీ విశ్లేషణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పన్ను భయాలను రూపుమాపుతానని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో అన్నారని, కానీ ప్రస్తుతం  అది సాధ్యమయ్యేలా కనబడటం లేదని ఆస్కి, ఫిక్కీ  నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. మంగళవారం బంజారాహిల్స్‌లోని ఆస్కి ఆడిటోరియంలో ఫిక్కీ, ఆస్కీలు కలిసి ‘2020-21 బడ్జెట్‌ పై విశ్లేషణ’ను నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న నిపుణులు, మేధావులు మాట్లాడుతూ.. బడ్జెట్‌లో కొత్తగా ప్రతిపాదించిన పన్ను విధానంలో వ్యక్తిగతంగా పన్నులు చెల్లించేవారికి పెద్దగా ప్రయోజనం లేకుండా చేశారని అభిప్రాయపడ్డారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణలభ్యతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.  భారతదేశంలో అతిపెద్ద లిటిగేటర్‌ ట్యాక్స్‌ డిపార్టుమెంట్‌గా నిపుణుల బృంద సభ్యులు అభివర్ణించారు. ఈ విభాగానికి ప్రతిఏటా టార్గెట్లను నిర్దేశించడం వల్ల లేనిపోని సమస్యల్ని సృష్టిస్తున్నారని తెలిపారు. పన్నులను కట్టనివారిని వదిలేసి పన్నులను సక్రమంగా కట్టేవారి మీద పడుతున్నారని చెప్పారు. ప్రతి సంస్థకో సం ఘం ఉన్నట్లే.. పన్నులు చెల్లించేవారు సంఘంగా ఏర్పడాలన్నారు.


అంబుడ్స్‌మన్‌ను నియమించాలి.. 

అమెరికా, యూకే వంటి దేశాల్లో పోలీసు కంప్లయింట్‌ కమిషన్‌ ఉన్నట్లే.. ఆదాయ పన్ను విభాగంలో ప్రత్యేకంగా అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణుల బృందం అభిప్రాయపడింది. అప్పుడే ఆదాయ పన్ను అధికారుల వేధింపులు గణనీయంగా తగ్గుతాయని విశ్లేషించారు. మనదేశంలో 67 ఏండ్లు దాటినవారు కాకుండా 25 నుంచి 45 ఏండ్ల యువకులు భారత నూతన విద్యావిధానాన్ని రూపొందించాలని సూచించారు. 


logo