న్యూఢిల్లీ, మే 5: టాటా స్టీల్ ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.7,161.91 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అధిక ఆదాయం సమకూరడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. ఏడాది క్రితం సంస్థ రూ.1,615.35 కోట్ల నష్టాన్ని చవిచూసింది. సమీక్షకాలంలో ఆదాయం రూ. 37,322.68 కోట్ల నుంచి రూ. 50,249 కోట్లకు పెరిగినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో కంపెనీ నిర్వహణ ఖర్చులు రూ.35, 432.42 కోట్ల నుంచి రూ.40,052 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర స్వల్పంగా పెరిగి రూ.1,068.95 వద్ద నిలిచింది.