శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 23, 2020 , 00:26:36

ప్రీమియం హ్యాచ్‌బాక్‌లోకి టాటా

ప్రీమియం హ్యాచ్‌బాక్‌లోకి టాటా
  • రూ.5.29 లక్షల అల్ట్రోజ్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన సంస్థ

ముంబై, జనవరి 22: దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటర్స్‌ తాజాగా ప్రీమియం హ్యాచ్‌బాక్‌ కార్ల విభాగంలోకి ప్రవేశించింది. రూ.5.29 లక్షల ప్రారంభ ధర కలిగిన అల్ట్రోజ్‌ను మార్కెట్లోకి విడుదల చేయడంతో ఈ విభాగంలోకి ప్రవేశించినట్లు అయింది. గతేడాది డిసెంబర్‌లో ప్రదర్శించిన ఈ కారును...బీఎస్‌-6 ప్రమాణాలతో అల్ఫా ప్లాట్‌ఫాం కింద రూపొందించిన తొలి డీజిల్‌ కారు ఇదేనని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇదివరకే సంస్థ నెక్సాన్‌, టియాగో, టిగోర్‌లను బీఎస్‌-6 వెర్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అల్ట్రోజ్‌తో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టినట్లు, భవిష్యత్తులో కాలుష్యాన్ని నియంత్రించే వాటిపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు టాటా మోటర్స్‌ ఎండీ, సీఈవో గ్యుంటర్‌ బుచెక్‌ తెలిపారు. ఈ నూతన ప్రీమియం హ్యాచ్‌బాక్‌లో భాగంగా ప్రవేశపెట్టిన అల్ట్రోజ్‌ కారు దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న అన్ని రిటైల్‌ అవుట్‌లెట్లలో లభించనున్నదన్నారు. అలాగే మార్కెట్లోకి 1.2 లీటర్ల రివోట్రాన్‌ టర్బోచార్జ్‌ పెట్రోల్‌ బీఎస్‌-6 ఇంజిన్‌తో తయారైన నూతన నెక్సాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.95 లక్షలుగా నిర్ణయించింది.  అలాగే రూ.4.60 లక్షల విలువైన 1.2 లీటర్ల రెవోట్రాన్‌ పెట్రోల్‌ బీఎస్‌-6 ఇంజిన్‌ కారు, రూ.5.75 లక్షల ధర కలిగిన టిగోర్‌ 2020ని కూడా ప్రవేశపెట్టింది. మరోవైపు, టియాగో, టిగోర్‌లు క్రాష్‌ టెస్ట్‌లో పాసయ్యాయి. గ్లోబల్‌ ఎన్‌సీఏపీ నిర్వహించిన క్రాష్‌ పరీక్షలో ఈ రెండు కార్లకు 4 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చింది.


logo