ఒట్టావా: కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భారత సంతతి వ్యక్తి, ఒంటారియో కోర్ట్ ఆఫ్ అప్పీల్ జడ్జి మహముద్ జమాల్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. జమాల్‌ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మహమూద్ జమాల్ 2019 నుంచి ఒంటారియో కోర్ట్ ఆఫ్ అప్పీల్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. దేశంలోని రెండు అగ్రశ్రేణి న్యాయ కళాశాలల్లో బోధకుడిగా పని చేశారు. సుప్రీంకోర్టులో 35 అప్పీళ్లతోపాటు దశాబ్దాలుగా న్యాయవాదిగా సేవలందించారు.
సుప్రీంకోర్టుకు ఆయన ఎంతో విలువైన ఆస్తి.. అందుకే, మనదేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఆయన్ను నామినేట్ చేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నా అంటూ ట్రూడో ట్విట్టర్లో పేర్కొన్నారు.
మహమూద్ జమాల్ నామినేషన్‌ను హౌస్ ఆఫ్ కామన్స్ జస్టిస్ కమిటీ ఆమోదించాల్సి ఉంది. కానీ ఇది ఫార్మాలిటీ మాత్రమే. 1967లో నైరోబిలో భారతీయ కుటుంబానికి ఆయన జన్మించారు. 1981లో కెనడాకు వెళ్లే వరకు బ్రిటన్‌లో ఎదిగారు.
బహుళ సంస్క్రుతులకు నిలయంగా కెనడా నిలిచింది. దేశంలోని 3.8 కోట్ల మంది జనాభాలో మూడోవంతు మైనారిటీ గ్రూప్ వారే. ఇటీవల ముస్లింలకు వ్యతిరేకంగా దాడులు జరిగాయి.
నల్ల జాతీయులు, ముస్లింలు, ఇతర మైనారిటీలకు వ్యతిరేకంగా సాగిన సాంస్క్రుతిక మారణ హోమంపై విచారణకు కెనడా ప్రభుత్వం కమిషన్‌ను నియమించింది.